close

ప్రధానాంశాలు

Published : 06/03/2021 05:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శవమై కనిపించిన వాహన యజమాని!

అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కేసు

ముంబయి: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ నివాసానికి సమీపంలో ఇటీవల కనుగొన్న పేలుడు పదార్థాల వాహనం కేసు మలుపులు తిరుగుతోంది. సంబంధిత వాహన (ఎస్‌యూవీ) యజమానిగా చెబుతున్న హిరేన్‌ మన్‌సుఖ్‌ (45) శుక్రవారం శవమై కనిపించారు. ఠాణేలోని ఓ సముద్రపు పాయ ఒడ్డున అతని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ కేసులో మరో మలుపు ఏమిటంటే - ఆ వాహనానికి అసలు యజమాని మన్‌సుఖ్‌ కాదని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ తెలిపారు. దక్షిణ ముంబయిలోని అంబానీ ఇంటికి సమీపంలో ఫిబ్రవరి 25న జిలెటిన్‌ స్టిక్స్‌తో ఉన్న ఓ వాహనాన్ని పోలీసులు కనుగొన్న సంగతి తెలిసిందే. అనంతరం ఆ ఎస్‌యూవీ తనదేనని, అంతకు వారం రోజుల ముందే అది చోరీకి గురైనట్లు హిరేన్‌ మన్‌సుఖ్‌ పోలీసులకు తెలిపారు. ముంబయి క్రైంబ్రాంచి పోలీసులు ఆయన వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. వాహన విడిభాగాల వ్యాపారం చేసే మన్‌సుఖ్‌ తన వాహనం చోరీకి గురైన విషయమై అంతకుముందే పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి నుంచి మన్‌సుఖ్‌ కనిపించడం లేదంటూ ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం ఠాణేలోని నౌపడా పోలీసులను ఆశ్రయించారు. అనంతరం ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. కాగా ప్రమాదవశాత్తూ మన్‌సుఖ్‌ మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఠాణే పోలీసులు తెలిపారు. మన్‌సుఖ్‌ మృతదేహంపై గాయాలైన గుర్తులేమీ లేవని, అయితే ఆటాప్సీ నివేదిక రావాల్సి ఉందని హోంమంత్రి దేశ్‌ముఖ్‌ తెలిపారు. ఆ వాహనం అసలు యజమాని దాన్ని కొన్ని పనుల నిమిత్తం మన్‌సుఖ్‌కు అప్పగించినట్లు చెప్పారు. పేలుడు పదార్థాల వాహనం కేసు దర్యాప్తును ఉగ్రవాద నిరోధక బృందానికి (ఏటీఎస్‌) అప్పగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన