close

ప్రధానాంశాలు

Published : 12/04/2021 03:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నంది విగ్రహం చోరీ ముఠా అరెస్టు

చిత్తూరు(నేరవార్తలు), న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా పలమనేరు మండలం జగమర్ల గ్రామంలోని మల్లేశ్వరస్వామి ఆలయంలో నంది విగ్రహం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చిత్తూరులో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సెంథిల్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు. ‘విగ్రహం చోరీపై ఈ నెల నాలుగో తేదీన ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేశాం. దర్యాప్తునకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. గత నెలలో గుడి వద్దకు ఓ ఆటో వెళ్లిందనే సమాచారంతో కేసును ఛేదించాం. తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన శ్రీనివాసులు అలియాస్‌ అశ్వత్థామ తనకు పరిచయస్థుడైన ఏర్పేడు మండలానికి చెందిన హరి.. పురాతన గుడిలో నిధుల కోసం అన్వేషించారు. ఈ క్రమంలో గత నెల 21న జగమర్ల అడవిలోని నంది విగ్రహాన్ని చోరీ చేసేందుకు పథకం వేశారు. అదే నెల 26న శ్రీనివాసులు తనకు పరిచయస్థులైన చలపతి, శ్రీధర్‌, వెంకటేష్‌, రంగబాబులను హరి వెంట పంపి విగ్రహాన్ని చోరీ చేయాలని సూచించాడు. ఐదుగురు కలిసి అదేరోజు విగ్రహాన్ని చోరీ చేసి..చిత్తూరు నగరానికి చెందిన మునింద్ర ఆధ్వర్యంలో స్థానిక నీటికుంటలో దాచారు. మరుసటి రోజు ఆ విగ్రహం కనిపించకపోవడంతో ముఠా సభ్యులు గొడవపడ్డారు. అదే ముఠాలోని రంగబాబు.. గుట్టుగా ప్రకాష్‌ నాయుడు, నరసింహులు, దశరథయ్య, గోపి అనే వారితో కలిసి నీటికుంటలోని విగ్రహాన్ని తొట్టంబేడు మండలం పొయ్య గ్రామానికి తరలించాడు. ఈ నెల రెండో తేదీన విగ్రహాన్ని పగులగొట్టారు. అందులో ఎలాంటి నిధి లేకపోవడంతో విగ్రహం ముక్కలను నాయుడుపేట- తిరుపతి మార్గంలోని స్వర్ణముఖి నదిలో పడేసినట్లు దర్యాప్తులో గుర్తించాం. మొత్తం 11 మంది నిందితులు కాగా..ఇందులో గోపి అనే నిందితుడు కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మిగిలిన పది మందిని అరెస్టు చేయడంతో పాటు రెండు ఆటోలు, మూడు ద్విచక్ర వాహనాలు, నంది విగ్రహం ముక్కలను స్వాధీనం చేసుకున్నాం’ అని ఎస్పీ వివరించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన