close

ప్రధానాంశాలు

Updated : 16/04/2021 08:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మణికట్టు కోసి చంపేశాడు

ఏడేళ్ల కుమారుడి దారుణ హత్య
వివాహేతర సంబంధానికి అడ్డు అని తండ్రి ఘాతుకం

కందనూలు, న్యూస్‌టుడే: ఇటీవల భార్య ఆత్మహత్యకు పాల్పడింది.. కంటికి రెప్పలా కాపాడాల్సిన పిల్లలను.. తండ్రి తనకు భారంగా భావించాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. అతని ఘాతుకానికి ఓ చిన్నారి బలవ్వగా.. మరో కుమారుడు బతికి బయటపడ్డాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కలచి వేసింది. పోలీసులు, గ్రామస్థుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌ మండలం మంతటి గ్రామానికి చెందిన ఎర్రమోని శివశంకర్‌, స్వప్న దంపతులకు మల్లికార్జున్‌(7), ప్రణయ్‌ (5) అనే ఇద్దరు సంతానం ఉన్నారు. శివశంకర్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మూడు నెలల కిందట కుటుంబ కలహాలతో స్వప్న పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. అప్పటి నుంచి ఇద్దరు పిల్లలు తండ్రి వద్దనే ఉంటుండగా, అదే ఇంట్లోని పక్క గదిలో అతని తల్లిదండ్రులు పుల్లయ్య, అలివేలు జీవిస్తున్నారు. కొంతకాలంగా శివశంకర్‌కు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. అందుకు చిన్నారులు అడ్డుగా వస్తున్నారని భావించిన అతను గురువారం తెల్లవారుజామున తన గదిలో నిద్రపోతున్న ఇద్దరి కుమారుల మణికట్టు వద్ద కత్తితో కోశాడు. తరవాత గ్రామ శివారులోని చెరువు వద్దకు వెళ్లి ‘‘పిల్లల చెయ్యి కోశాను.. నేను చెరువులో దూకి చనిపోతున్నా’’ అని తల్లిదండ్రులకు సెల్‌ఫోన్‌లో తెలిపాడు. పక్క గదిలో ఉన్న వారిద్దరూ పిల్లల వద్దకు వెళ్లి చూడగా మల్లికార్జున్‌ అప్పటికే మృతి చెందగా, ప్రణయ్‌ తీవ్రంగా గాయపడి ఉన్నాడు. వెంటనే శంకర్‌ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారమిచ్చి ప్రణయ్‌ను నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చెరువు వద్ద ఉన్న శివశంకర్‌ను గ్రామస్థులు పట్టుకుని చెట్టుకు కట్టేసి కొట్టారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ మోహన్‌రెడ్డి పరిశీలించారు. ప్రస్తుతం చిన్నారి ప్రణయ్‌ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని పోలీసులు తెలిపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన