close

ప్రధానాంశాలు

Updated : 16/04/2021 12:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చిన్నారిని చిదిమేసిన మూఢనమ్మకం

ఆరునెలల బిడ్డ గొంతు కోసిన తల్లి
దేవుడి పటాల ముందే ఉన్మాద చర్య

మోతె, న్యూస్‌టుడే: మూఢనమ్మకం ముక్కు పచ్చలారని ఓ చిన్నారి ఉసురు తీసింది. పూజల పేరుతో ఆరు నెలల బిడ్డను కన్నతల్లే దేవుడి సాక్షిగా కత్తితో గొంతు కోసి హతమార్చిన దారుణం సూర్యాపేట జిల్లా మోతె మండలం మేకలపాటి తండాలో చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన బానోత్‌ భారతికి కృష్ణతో రెండేళ్ల కిందట వివాహమైంది. ఆమెకు ఎనిమిదేళ్ల కిందట మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో పెళ్లయినా కొద్దిరోజులకే విడిపోయారు. అనంతరం పుట్టింటికి వచ్చేసిన భారతి అదే తండాకు చెందిన కృష్ణను ప్రేమించింది. మొదట వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో పెద్దమనుషులు పెళ్లి చేశారు. ఆరు నెలల కిందట వారికి కూతురు పుట్టింది. భారతి రోజూ యూట్యూబ్‌లో రకరకాల ఆధ్యాత్మిక వీడియోలు చూస్తూ.. తనను తాను శివుడిగా భావిస్తూ ఉండేది. ఇటీవల గ్రామానికి వచ్చిన ఓ సాధువు.. ఆమెకు నాగదోషం ఉందని చెప్పినట్లు స్థానికులు తెలిపారు. అప్పటి నుంచి ఆమె మానసిక పరిస్థితి మరింత దిగజారింది. నిత్యం పూజలతోనే గడిపేది. గురువారం భర్త కృష్ణ పని మీద సూర్యాపేటకు.. అత్తమామలు పొలం పనులకు వెళ్లారు. ఆ సమయంలో భారతి తన కూతురు రీతును (6 నెలలు) దేవుడి పటం ముందు పడుకోబెట్టి కత్తితో గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావమై ఆ పసికందు అక్కడికక్కడే మరణించింది. తర్వాత ఆమె అదే తండాలోని పుట్టింటికి వెళ్లింది. భారతి తల్లి బూబ బిడ్డ ఎక్కడని.. అడిగితే సరిగా సమాధానం చెప్పకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె వాళ్లింటికి చూడటంతో చిన్నారి రక్తపుమడుగులో ఉంది. బీఎస్సీ బీఈడీ చదివిన భారతి ఐదేళ్ల కిందట ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సన్నద్ధమైనట్లు స్థానికులు తెలిపారు. ఈమె కొద్దిరోజుల క్రితం ఓ అంగన్‌వాడీ కార్యకర్త ఇంటికి వెళ్లి చంపుతానని బెదిరించినట్లు తండావాసులు చెబుతున్నారు. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతోనే ఇలా చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన