close

ప్రధానాంశాలు

Published : 16/04/2021 04:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఓఆర్‌ఆర్‌పై కంటైనర్‌ దగ్ధం... ఇద్దరు డ్రైవర్ల సజీవ దహనం

ఈనాడు, హైదరాబాద్‌, రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: అది బాహ్య వలయరహదారి.. తెల్లవారుజామున 4 గంటలు.. గుర్తు తెలియని వాహనాన్ని భారీ కంటైనర్‌ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. కంటైనర్‌ ముందు భాగం దెబ్బతింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో అంతా వ్యాపించాయి. క్యాబిన్‌లో ఉన్న డ్రైవర్లు కిందకు దిగేందుకు యత్నించినా రెండు వైపులా తలుపులు తెరుచుకోలేదు. రక్షించండి.. కాపాడండి.. అంటూ వేడుకుంటూనే మంటల్లో ఆహుతయ్యారు. ఈ హృదయ విదారక ఘటన రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో గురువారం చోటు చేసుకుంది.

మహారాష్ట్రలోని థానేకు చెందిన మృత్యుంజయ యాదవ్‌(38), ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సూర్యకుమార్‌(31) ఆరు నెలలుగా పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు నివాసి ఉమామహేశ్వర్‌కు చెందిన కంటైనర్‌ను నడుపుతున్నారు.  ఈ నెల 14న సాయంత్రం పాలకొల్లు నుంచి రొయ్యల లోడ్‌తో మహారాష్ట్రకు బయలుదేరారు. గురువారం తెల్లవారుజామున 4 గంటలకు హిమాయత్‌సాగర్‌ సమీపంలో ఓఆర్‌ఆర్‌పై ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీ కొట్టారు. దీంతో కంటైనర్‌ కుడివైపు భాగం ధ్వంసమైంది. వెంటనే మంటలు చెలరేగడంతో మృత్యుంజయ యాదవ్‌, సూర్యకుమార్‌ క్యాబిన్‌లో చిక్కుకుపోయారు. డోర్లు తీసేందుకు యత్నించినా అవి రాలేదు. అటువైపు వెళ్తున్న వాహనదారులు కంటైనర్‌ అద్దాలను పగలగొట్టినా వారిని బయటక తీయడం సాధ్యం కాలేదు. వారిద్దరూ అందులోనే సజీవ దహనమయ్యారు. అప్పటికే మంటలు పూర్తిగా వ్యాపించడంతో నిస్సహాయంగా చూస్తుండిపోయినట్లు ప్రత్యక్షసాక్షులు ‘ఈనాడు’కు వివరించారు. పోలీసులు, అగ్నిమాపక శాఖాధికారులు అక్కడకు చేరుకుని రెండు ఫైరింజిన్లతో గంటసేపు శ్రమించి మంటల్ని ఆర్పారు. ఈ ఘటనతో ఓఆర్‌ఆర్‌పై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. లారీ డ్రైవర్లు. మృత్యుంజయ యాదవ్‌కు ఎనిమిది నెలలు, సూర్యకుమార్‌కు ఆరు నెలల పిల్లలు ఉన్నారు.

ఆ గ్యాస్‌ సిలిండర్‌తోనే..
సాధారణంగా ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన లారీ డ్రైవర్లు బండిని పక్కన ఆపి వంట చేసుకుంటారు. ఇందుకోసం క్యాబిన్‌లో నిత్యావసర వస్తువులు, చిన్న గ్యాస్‌ స్టౌ వంటివి తమ వెంట తీసుకెళ్తుంటారు. ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టినప్పుడు నిప్పురవ్వలు ఎగిసిపడి లారీలో ఉన్న గ్యాస్‌ సిలిండర్‌కు అంటుకుని మంటలు వ్యాపించి ఉంటాయనే అంచనాకొచ్చినట్లు రాజేంద్రనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.కనకయ్య ‘ఈనాడు’కు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన