close

ప్రధానాంశాలు

Published : 18/04/2021 07:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మత్తులో తూలి... రాయితో మోది..

తండ్రిని దారుణంగా చంపిన కొడుకు

పెన్‌పహాడ్‌, న్యూస్‌టుడే: చెడు వ్యసనాలకు బానిసై, డబ్బులు ఇవ్వలేదనే కోపంతో తండ్రిని రాయితో మోది అతి కిరాతకంగా హత్య చేశాడో కుమారుడు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం నారాయణగూడెంలో ఈ దారుణ ఘటన జరిగింది. నారాయణగూడెం గ్రామానికి చెందిన నంద్యాల అంజిరెడ్డి(70), పుల్లమ్మ దంపతుల కుమారుడు అమరసింహారెడ్డి. పుల్లమ్మ పదేళ్ల క్రితం మరణించగా కుమార్తె కీర్తి భర్తతోపాటు హైదరాబాద్‌లో ఉంటోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో అమరసింహారెడ్డిని గారాబంగా పెంచారు. వేలకు వేలు ఫీజులు చెల్లించి ప్రైవేటు పాఠశాలలో చదివించారు. 2014లో హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్‌ పూర్తిచేశాక ఉన్నత చదువులకు కెనడా పంపించారు. అక్కడ ఉన్న నాలుగేళ్లలో అమరసింహారెడ్డి మద్యం, మత్తు పదార్థాలకు బానిసగా మారాడు. చదువును పూర్తిగా పక్కన పెట్టేసి డబ్బులు పంపించాలంటూ తండ్రిని వేధించేవాడు. డబ్బుల కోసం కొద్దిరోజులు కెనడాలో క్యాబ్‌ డ్రైవర్‌గా కూడా పనిచేశాడు. అనంతరం అక్క కీర్తి జోక్యం చేసుకుని తమ్ముణ్ని హైదరాబాద్‌ తీసుకొచ్చారు. అయినా అమరసింహారెడ్డి అలవాట్లు మారలేదు. తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేసి జల్సాలు చేసేవాడు. ఆ బాకీలు తీర్చేందుకు గ్రామంలోని రెండు ఎకరాల పొలం కూడా అమ్మారు. సోదరి సైతం విసిగిపోయి అక్కడి నుంచి పంపేయడంతో అమరసింహారెడ్డి నారాయణగూడెంలో తండ్రి దగ్గరకు వచ్చాడు. ఇంట్లో దాచిన నగదు తీసుకెళ్లి చెడు వ్యసనాలకు ఖర్చు చేసేవాడు. ఈ విషయంలో తండ్రీకొడుకుల మధ్య తరచుగా వాగ్వాదం జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి మద్యం తాగి వచ్చిన అమరసింహారెడ్డి.. తండ్రిని డబ్బులు అడిగాడు. తండ్రి ఇవ్వకపోవడంతో విచక్షణ కోల్పోయిన అమరసింహారెడ్డి ఇనుప బకెట్‌తో దాడిచేశాడు. కిందపడిపోయిన తండ్రి ముఖంపై రాయితో బలంగా మోదడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. శనివారం  సూర్యాపేట డీఎస్పీ మోహన్‌కుమార్‌, గ్రామీణ సీఐ విఠల్‌రెడ్డి, పెన్‌పహాడ్‌ ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం సూర్యాపేట జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. కీర్తి ఫిర్యాదుతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన