close

ప్రధానాంశాలు

Updated : 20/04/2021 05:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాతకక్షలతో దంపతుల హత్య

పెద్దమ్మ, పెదనాన్నను కిరాతకంగా నరికి చంపిన దాయాదులు
నిందితుల్లో పదిహేడేళ్ల బాలుడు  
నల్గొండ జిల్లా బుగ్గతండాలో దారుణం

నేరెడుగొమ్ము, న్యూస్‌టుడే: రక్తసంబంధాలను మరచి చిన్న తగాదాలకే పగ పెంచుకొని పెద్దమ్మ, పెదనాన్నలను దాయాదులు గొడ్డళ్లు, కత్తులతో నరికి చంపిన ఘటన నల్గొండ జిల్లా నేరెడుగొమ్ము మండలం బుగ్గతండాలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పాత కక్షలతోపాటు ఇటీవల జరిగిన చిన్నపాటి గొడవే ఈ హత్యలకు కారణమని తెలుస్తోంది. ఆనాటి గొడవను వీడియో తీసి పోలీసులకు చూపించి రక్షణ కోరినా పట్టించుకోలేదని, అందుకే ఇంత ఘోరం జరిగిందంటూ మృతుల కుమారుడు విలపిస్తున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ తండాకు చెందిన సోమాని (55), బుల్లి (50) భార్యాభర్తలు. సోమాని మొదటి భార్య బుజ్జిపై పాతికేళ్ల క్రితం అతడి సోదరుడైన లచ్య అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించగా లచ్య బలంగా కొట్టడంతో బుజ్జి చనిపోయింది. పెద్దమనుషులు పంచాయతీ పెట్టి గొడవ సద్దుమణిగించారు. నాటి నుంచి ఇరు కుటుంబాల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. రెండేళ్ల క్రితం లచ్య మరణించాడు. గత ఫిబ్రవరిలో ఇరుకుటుంబాల మధ్య చిన్నగొడవ జరిగి పోలీసులను ఆశ్రయించినా పెద్దమనుషుల మాటపై కేసు ఉపసంహరించుకున్నారు. ఈమధ్యనే మరోసారి వివాదం రేగడంతో మళ్లీ పోలీసులను ఆశ్రయించారు. అది మనసులో పెట్టుకున్న లచ్య కుమారులు రమేష్‌, నరేష్‌, సురేష్‌తోపాటు 17 ఏళ్ల వయసున్న మరో సోదరుడు కలిసి ఆదివారం రాత్రి ఆరుబయట నిద్రపోతున్న పెదనాన్న, పెద్దమ్మలపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. వారి కేకలు విని.. సోమాని కొడుకు మాంజ్య, కోడలు జ్యోతి బయటకు రాగా నిందితులు మంజ్యపైనా దాడి చేయబోయారు. జ్యోతి వారి కాళ్లపై పడి వేడుకోవడంతో వదిలేసి పరారయ్యారు. 

పక్కా ప్రణాళికతో..
నిందితుల్లో రమేష్‌, నరేష్‌ హైదరాబాద్‌లో ఉంటుండగా.. సురేష్‌, పదో తరగతి చదువుతున్న తమ్ముడు, తల్లి మంగతో కలిసి తండాలోనే ఉంటున్నాడు. సురేష్‌ కొద్దిరోజులుగా నిత్యం తాగుతూ.. పెద్దనాన్నను చంపేస్తానంటూ స్నేహితులతో అన్నట్లు తెలిసింది. ఇదే క్రమంలో హైదరాబాద్‌లో ఉండే తన అన్నలు రమేష్‌, నరేష్‌కు ఫోన్‌ చేసి ఆదివారం ఇంటికి రప్పించాడు. తమ పశువుల్ని, ఇంట్లోని విలువైన సామగ్రిని ముందుగానే పక్క ఊళ్లో ఉండే బంధువుల ఇంటికి తరలించారు. అన్నదమ్ములందరూ కలిసి పదునైన గొడ్డళ్లు, కత్తులను సమకూర్చుకుని చివరకు పెద్దనాన్న, పెద్దమ్మను కర్కశంగా నరికేశారు. నిందితుల్లో చిన్నవాళ్లిద్దరూ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఉండే అన్నదమ్ములు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన