close

ప్రధానాంశాలు

Published : 04/05/2021 04:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిశీధిలో.. నిప్పు మింగింది!

ఇల్లు దగ్ధమై బాలిక సజీవదహనం

న్యూస్‌టుడే, టేక్మాల్‌: ‘అన్నా.. బయట దోమలు కరుస్తున్నయ్‌.. ఇంట్లకు పోయి పడుకుంట..’ అని వెళ్లి గాఢ నిద్రలోకి చేరిన అభం శుభం తెలియని చిన్నారి.. అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైంది. బిడ్డను రక్షించబోయిన తండ్రి తీవ్రగాయాల పాలయ్యాడు. ఆదివారం అర్ధరాత్రి మెదక్‌ జిల్లా గొల్లగూడెంలో జరిగిందీ దారుణం. టేక్మాల్‌ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన ఎల్లంపల్లి సిద్దిరాములుకు భార్య వెంకటలక్ష్మి, కుమారుడు రవీందర్‌, కుమార్తె భవాని(10) ఉన్నారు.  ఆదివారం రాత్రి తమ పొలంలో ధాన్యం నూర్పిళ్లు జరుగుతుండటంతో తల్లిదండ్రులు వెంకటలక్ష్మి, సిద్దిరాములు అక్కడికి వెళ్లిపోయారు. ఇంటి ముందున్న వడ్ల కుప్పకు కావలిగా పిల్లలిద్దరూ ఉన్నారు. బయట దోమలు కుడుతుండడంతో అన్న రవీందర్‌కు చెప్పి చెల్లెలు భవాని ఇంట్లోకి వెళ్లి తలుపు, గొళ్లెం వేసుకొని నిద్రలోకి జారుకుంది. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఇంటికి మంటలు అంటుకొని వేగంగా చుట్టూరా వ్యాపించాయి. స్థానికులు మంటలను గమనించి కొందరు నీళ్లతో ఆర్పే యత్నం చేశారు. తల్లిదండ్రులు పొలం నుంచి హుటాహుటిన పరుగెత్తుకొచ్చారు. కుమార్తె లోపల ఉందనే విషయం తెలుసుకొని తండ్రి తలుపులు తీసి రక్షించే యత్నం చేశారు. మంటల వల్ల ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. అప్పటికే పాప సజీవదహనమైంది. జోగిపేట నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు. ఇంటిలోని ఆధార్‌, బ్యాంకు పత్రాలు, ఆభరణాలు, ఇల్లు కట్టుకునేందుకు తెచ్చుకున్న రూ.లక్ష నగదు, ఇతర సామగ్రి కాలిపోయాయని బాధితులు తెలిపారు. ఇంటి ముందున్న స్తంభం నుంచి రెండు విద్యుత్తు కనెక్షన్ల తీగలున్నాయి. రెండూ కాలిపోవడంతో ఇంటికి అగ్ని ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. బాలిక తల్లి ఫిర్యాదుతో టేక్మాల్‌ ఏఎస్సై తుక్కయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన