close

ప్రధానాంశాలు

Published : 05/05/2021 04:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చేపలకుంటలో ట్రాక్టర్‌ బోల్తా

సర్పంచి సహా నలుగురు మహిళల మృతి

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: గ్రామీణం, న్యూస్‌టుడే: వారంతా పేదింటి మహిళలు... కుటుంబానికి చేదోడుగా ఉంటుందని వ్యవసాయ పనులకు వెళ్లేవారు.. మంగళవారం కూడా అలాగే పుచ్చకాయల కోతలకు బయలుదేరిన కొద్దిసేపటికే.. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టరు అదుపు తప్పి చేపల కుంటలో బోల్తాపడింది. దీంతో నలుగురు మహిళలతో సహా ఆ గ్రామ సర్పంచిని మృత్యువు పొట్టన పెట్టుకుంది. మృతులంతా నెల్లూరు జిల్లా నెల్లూరు గ్రామీణ మండలం సజ్జాపురం వాసులే. పోలీసులు తెలిపిన ప్రకారం... సజ్జాపురం సర్పంచి అప్పకూటి పెంచలయ్య(75) పక్కనే ఉన్న గొల్లకందుకూరులో పదెకరాల భూమిని కౌలుకు తీసుకొని పుచ్చకాయలు సాగు చేశారు. తోటలోని కాయలను కోసి లోడ్‌ చేసేందుకు మంగళవారం తొమ్మిది మంది స్థానికులను తీసుకొని ఉదయం 9.45 గంటలకు ట్రాక్టర్‌లో బయలుదేరారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మార్గమధ్యంలో మలుపు వద్ద వీరి ట్రాక్టర్‌ అదుపు తప్పి పక్కనే ఉన్న చేపల కుంటలో పడిపోయింది. ఆ సమయంలో ట్రాక్టర్‌ డ్రైవరుతోపాటు మరో పది మంది ఉన్నారు. ప్రమాదంలో ట్రాక్టర్‌ ట్రాలీలో కూర్చున్న వారు కుంటలోని నీటిలో పడగా.. వారిపై ట్రాలీ బోల్తాపడింది. ఫలితంగా అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో సర్పంచితోపాటు కిలారు హైమావతి(35), పాతం కృష్ణవేణి(20), నాళి లక్మీకాంతమ్మ(45), తాండ్ర వెంకటరమణమ్మ(18) ఉన్నారు. ట్రాక్టర్‌లో నుంచి పక్కకు దూకిన ముగ్గురితోపాటు ఇంజిన్‌పై కూర్చున్న ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం నుంచి బయటపడిన వారితోపాటు సమీపంలో ఉన్న ప్రజలు వెంటనే కుంటలోకి దిగి.. ట్రాలీని లేపేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. ఇది తెలిసిన గ్రామస్థులు హుటాహుటిన చేరుకొని ట్రాలీని పైకి లేపారు. ఇదంతా జరిగేసరికి గంట సమయం పట్టింది. ట్రాలీ కింద చిక్కుకున్న వారు ఊపిరాడక మృతి చెందారు. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు.

అతివేగం.. అజాగ్రత్తే కారణం
పుచ్చకాయలు కోసే పొలానికి వెళ్లే దారి చాలా ఇరుకుగా ఉంటుంది. ఏ మాత్రం అదుపు తప్పినా ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ. అయితే ఈ మార్గంలో పొలాలకు వెళ్లే వాహనాలు నిత్యం తిరుగుతూనే ఉంటాయి. మంగళవారం జరిగిన ప్రమాదానికి ట్రాక్టర్‌ డ్రైవరు పి.మోహన్‌ అజాగ్రత్తే కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. మలుపు వద్ద వాహనాన్ని అతివేగంగా తిప్పేందుకు యత్నించడంతో.. అదుపు తప్పిన వాహనం పక్కనున్న కుంటలో బోల్తాపడింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన