కుమార్తెను ప్రేమించాడని నరికేశాడు

ప్రధానాంశాలు

Published : 29/05/2021 04:56 IST

కుమార్తెను ప్రేమించాడని నరికేశాడు

  బాలిక తండ్రి ఘాతుకం

పలమనేరు, న్యూస్‌టుడే: కుమార్తెను ప్రేమించాడన్న కోపంతో యువకుడిని బాలిక తండ్రి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పలమనేరు డీఎస్పీ గంగయ్య కథనం ప్రకారం.. ధనశేఖర్‌(23) బెంగళూరులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా గతవారం గ్రామానికి వచ్చాడు. పక్కింట్లో ఉన్న బాలిక(16)ను ప్రేమించాడు. ఈనెల 22న తను ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు బాలిక తన తండ్రి ఫోన్‌ ద్వారా యువకుడికి సందేశం పంపింది. అతను బాలిక వద్దకు వెళ్లాడు. అదే సమయంలో బాలిక తండ్రి బాబు ఇంటికి వచ్చాడు. కుమార్తె, యువకుడు ఒకే గదిలో ఉండటాన్ని గుర్తించాడు. ‘నీతో మాట్లాడాలి..’ అంటూ ధనశేఖర్‌ను బాబు వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లాడు. కత్తితో అత్యంత పాశవికంగా నరికి హత్య చేశాడు. మృతదేహాన్ని తన వ్యవసాయ బావిలో పడేశాడు. మూడు రోజుల తరువాత మృతదేహం పైకి తేలింది. హత్య గురించి అందరికీ తెలిసిపోతుందని భావించిన బాబు.. మృతదేహాన్ని బయటకి తీసి ముక్కలుగా చేసి.. తన పొలంలో పూడ్చి పెట్టాడు. కుమారుడు కనిపించకపోవడంతో మృతుడి తండ్రి ఈనెల 26న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలిక తండ్రే తమ కుమారుడిని ఏదో చేసి ఉంటాడని ఆరోపిస్తూ గురువారం సాయంత్రం రోడ్డుపై ఆందోళన కూడా చేశారు. మృతుడి కాల్‌డేటాను విశ్లేషించిన పోలీసులు బాబునే ఈ హత్య చేసినట్లు గుర్తించారు. శుక్రవారం మృతదేహాన్ని వెలికితీశారు. శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలమనేరు సీఐ జయరామయ్య ఆధ్వర్యంలో ఎస్‌ఐ నాగరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ధనశేఖర్‌ను హత్య చేసిన బాబుతో పాటు ఆయనకు సహకరించిన అందర్నీ అరెస్టు చేస్తామని డీఎస్పీ గంగయ్య స్పష్టం చేశారు. ఇప్పటికే బాబు, ఆయన భార్య, కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన