TS News: భార్య.. ఇద్దరు పిల్లలకు ఉరి

ప్రధానాంశాలు

Updated : 05/06/2021 13:23 IST

TS News: భార్య.. ఇద్దరు పిల్లలకు ఉరి

చివరగా తానూ ఆత్మహత్య
మేడ్చల్‌ జిల్లాలో దారుణం

కీసర, న్యూస్‌టుడే: బలవన్మరణానికి భార్యా పిల్లలకు ఏం చెప్పి ఒప్పించాడో? పిల్లలు చిన్నవారు కాబట్టి వారించలేకపోయినా కనీసం భార్య అయినా భర్తను ఎందుకు నిలువరించలేకపోయిందో? గదిలో అతడు ఒక్కొక్కరికి ఉరి వేసి ఊపిరి తీస్తున్నప్పుడు తక్కిన ప్రాణాలు ఎంతగా విలవిల్లాడాయో? వారు బయట వారి సాయం అర్థిస్తూ బిగ్గరగా అరచినా దారుణం తప్పేదేమో? మరి వారి నిస్సహాయత ఏమిటో.. ఎందుకో ఆ గదిలోని నాలుగు గోడలకు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఎందుకంటే చివరగా అతడూ ఊపిరితీసుకున్నాడు. తొలుత భార్యను, తర్వాత పిల్లలను చంపేసి మంచంపై పడుకోబెట్టినట్లు గదిలోని వాతావరణం ఉందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఘటన శుక్రవారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. యాదాద్రి-భువనగిరి జిల్లా రాజపేట మండలం రేణిగుంట గ్రామానికి చెందిన పల్లపు భిక్షపతి(36) బతుకుదెరువు నిమిత్తం భార్య ఉష(28), కుమార్తె హర్షిణి(11), కొడుకు యశ్వంత్‌(7)లతో నగర శివారు ప్రాంతానికి వలస వచ్చాడు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. నాగారం మున్సిపాలిటీలోని పశ్చిమ (వెస్ట్‌)గాంధీనగర్‌లో గది అద్దెకు తీసుకొని కాపురం ఉంటున్నారు. తన కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని గురువారం సాయంత్రం స్థానికుడు ఒకరు మరికొందరితో కలిసి భిక్షపతిని కొట్టాడు. మరుసటి రోజు కుల పెద్దల సమక్షంలో మాట్లాడదామని చెప్పి వారు వదిలేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు భిక్షపతి ఆటో తీసుకుని వెళ్తుండగా అడ్డుకుని మళ్లీ గొడవ పడి కొట్టారు. ఆటో అద్దాలు ధ్వంసం చేశారు. భిక్షపతి ఇంట్లోకి వెళ్లి ఎంతకూ రాకపోవడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమ చావుకు ఫలానా వారు కారణమంటూ భిక్షపతి కొంతమంది పేర్లు ఓ లేఖలో రాసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా అతడి బంధువులు అడ్డుకున్నారు. నలుగురి మృతికి కారణమైన వారిని అరెస్టు చేసి న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన