ఏపీ పోలీసుల అదుపులో ఎనిమిది మంది బంగ్లాదేశీయులు

ప్రధానాంశాలు

Published : 03/07/2021 05:25 IST

ఏపీ పోలీసుల అదుపులో ఎనిమిది మంది బంగ్లాదేశీయులు

దేశంలోకి చొరబాటు
హావ్‌డా నుంచి రైళ్లలో ప్రయాణం
రాజమహేంద్రవరం, విజయవాడల్లో పట్టుకున్న ఆర్‌పీఎఫ్‌

ఈనాడు- అమరావతి, రాజమహేంద్రవరం నేరవార్తలు- న్యూస్‌టుడే: బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి అక్రమంగా చొరబడిన 8 మందిని రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్‌) సిబ్బంది శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. హావ్‌డా- చెన్నై సెంట్రల్‌ ప్రత్యేక రైల్లో ప్రయాణిస్తున్న నలుగుర్ని రాజమహేంద్రవరంలోనూ, హావ్‌డా- వాస్కోడిగామా రైలులో ప్రయాణిస్తున్న మరో నలుగుర్ని విజయవాడలోనూ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నకిలీ ఆధార్‌, గుర్తింపుకార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక వివరాల సేకరణ పూర్తయిన అనంతరం.. వారిని స్థానిక పోలీస్‌స్టేషన్లలో అప్పగించారు. వారెక్కడి నుంచి వచ్చారు? దేశంలోకి ఎలా ప్రవేశించారు? నకిలీ గుర్తింపుకార్డుల్ని ఎలా సంపాదించారనే అంశాలపై ప్రశ్నిస్తున్నారు.

ప్రయాణికులతో గొడవపడి పట్టుబడ్డారు
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కోల్‌కతాలో రైలు ఎక్కిన బంగ్లాదేశీయులు శ్రీకాకుళం జిల్లా పలాస వరకూ మాత్రమే రిజర్వేషన్‌ చేయించుకున్నారు. అక్కడ దిగకుండా అవే సీట్లలో కూర్చున్నారు. పలాస నుంచి చెన్నై వెళ్లడానికి రిజర్వేషన్‌ చేయించుకున్నామని ఆ సీట్లు తమవని అడిగిన ప్రయాణికులతో ఘర్షణకు దిగారు. ప్రయాణికులు రైల్వే హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయడంతో ఆర్‌పీఎఫ్‌ పోలీసులు విశాఖపట్నంలో రంగంలోకి దిగి వారిని ప్రశ్నించారు. వారు అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డారని నిర్ధారించుకుని రాజమహేంద్రవరంలో దించేశారు. ఆర్‌పీఎఫ్‌కు పట్టుబడ్డ నలుగురిలో కరీంఖాన్‌ ఉత్తరప్రదేశ్‌ వాసిని అంటూ నకిలీపత్రాలు సృష్టించుకున్నారు. వాటితోనే తనతోపాటు షేక్‌ సద్దాం, మహ్మద్‌ అలీ అమీన్‌, మహ్మద్‌ షకాయత్‌ హుస్సేన్‌లకూ రిజర్వేషన్‌ చేయించుకున్నారు. మరోవైపు హావ్‌డా- వాస్కోడిగామా రైలులోని ఎస్‌2 బోగీలోని 10 నుంచి 14 నంబర్లున్న బెర్తుల్లో అక్రమ చొరబాటుదారులైన కొందరు బంగ్లాదేశీయులు ప్రయాణిస్తున్నారంటూ కేంద్ర నిఘా విభాగం ఇచ్చిన సమాచారంతో ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది విజయవాడలో నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. 8 మంది బంగ్లాదేశీయులను ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారన్న సమాచారం ఆధారంగా వారి వివరాల గురించి ఆంధ్రప్రదేశ్‌ కౌంటర్‌ ఇంటలిజెన్స్‌ విభాగం ఆరా తీస్తోంది. వారు ఉపాధి కోసం వచ్చారా? ఏదైనా ఉగ్ర కార్యకలాపాలు ఉన్నాయా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. ఇటీవల బిహార్‌లోని దర్బంగా రైల్వేస్టేషన్‌లో పేలుడుకు రసాయన పదార్థాల్ని రైల్లోనే తీసుకెళ్లినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలిన నేపథ్యంలో తాజా ఘటనపైనా అప్రమత్తమయ్యారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన