ఎగ్జిబిషన్‌ సొసైటీలో ఏసీబీ సోదాలు

ప్రధానాంశాలు

Updated : 03/07/2021 12:33 IST

ఎగ్జిబిషన్‌ సొసైటీలో ఏసీబీ సోదాలు

కొనసాగుతున్న రికార్డుల పరిశీలన

అబిడ్స్‌, న్యూస్‌టుడే: ప్రతిష్ఠాత్మకమైన నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీపై తాజాగా నీలినీడలు కమ్ముకున్నాయి. నిధుల గోల్‌మాల్‌, స్టాళ్ల కేటాయింపులో అక్రమాలకు సంబంధించి అందిన ఫిర్యాదులతో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత సొసైటీ గోల్డెన్‌ జూబ్లీ బ్లాక్‌లోని ప్రధాన కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. తనిఖీలు శుక్రవారం రాత్రి కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎగ్జిబిషన్‌ సొసైటీతోపాటు అనుబంధ సంస్థలైన ఉస్మానియా పట్టభద్రుల సంఘం, ఎకనామిక్‌ కమిటీల్లో గత ఆరేళ్లలో పలు అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు అనిశా డీఎస్పీ శ్రీకాంత్‌ తెలిపారు. ‘‘సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. స్టాళ్ల కేటాయింపు, కళాశాలల్లో భవనాల నిర్మాణానికి నిధులు, సొసైటీలో సభ్యత్వాలపై పూర్తి వివరాలు సేకరించి, నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తాం. గత ఆరేళ్లుగా కీలక పదవుల్లో పనిచేసిన వారి వివరాలు సైతం నమోదు చేస్తున్నాం. ఎవరెవరు అక్రమాలకు పాల్పడ్డారో ఇందులో బయటపడుతుంది’’ అని వివరించారు. ఈ సొసైటీకి ఏడేళ్ల పాటు గౌరవ అధ్యక్షుడిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కొనసాగారు. రాజకీయ విభేదాలతో గత నెలలో ఆయన తెరాసకు, ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు.

అక్రమాలకు తావు లేదు: ప్రభాశంకర్‌, సొసైటీ కార్యదర్శి
సుదీర్ఘ చరిత్ర కలిగిన ఎగ్జిబిషన్‌ సొసైటీలో అక్రమాలకు తావులేదు. విచారణ చేయాల్సి ఉందని అనిశా అధికారులు రాగా.. వారికి సహకరిసున్నాం. సొసైటీ కార్యకలాపాలన్నీ పారదర్శకంగానే జరుగుతున్నాయి. సొసైటీ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు. ఏ విషయంలోనూ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు సంబంధం లేదు. ఆయన కేవలం గౌరవాధ్యక్షుడు. 250 మంది సభ్యులు కలిగిన ఎగ్జిబిషన్‌ సొసైటీలో తొలిసారి అవినీతి నిరోధక శాఖ  సోదాలు చేస్తోంది.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన