మద్యం చిచ్చుకు మూడు ప్రాణాలు బలి

ప్రధానాంశాలు

Updated : 09/07/2021 12:13 IST

మద్యం చిచ్చుకు మూడు ప్రాణాలు బలి

భర్త ఆగడాలు భరించలేక..  పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
కొద్దిలో తప్పించుకున్న మూడేళ్ల చిన్నారి  

చౌటుప్పల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: మద్యం మంటలు ఓ కాపురాన్ని కూల్చేశాయి.. మూడు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. తాగుబోతు భర్త ఆగడాలు భరించలేని ఓ మహిళ కన్నబిడ్డలకు ఉరి బిగించి, తానూ ప్రాణాలు తీసుకుంది. తల్లి, ఇద్దరు పిల్లలు మృతిచెందగా మూడేళ్ల చిన్నారి మాత్రం అదృష్టవశాత్తు బయటపడింది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో గురువారం చోటుచేసుకుంది. రాంనగర్‌కాలనీకి చెందిన తొర్పునూరి వెంకటేశ్‌ మద్యానికి బానిసై ఇల్లు పట్టకుండా తిరిగేవాడు. భార్య ఉమారాణి(30) ఇంటి వద్ద చిన్న కిరాణా దుకాణం నిర్వహిస్తూ ముగ్గురు ఆడపిల్లలతో పాటు భర్తను తానే పోషించేది. అతడు నిత్యం తాగి వచ్చి తగాదా పడేవాడు. బంధువులు పలుమార్లు నచ్చజెప్పినా మార్పు రాలేదు. విరక్తి చెందిన ఉమారాణి గురువారం తెల్లవారుజామున ఇంటి పైకప్పునకు రెండు చీరలు వేసి పెద్దకుమార్తె హర్షిణి(12), రెండో కుమార్తె లాస్య(8)కు మొదట ఉరిబిగించింది. తర్వాత చిన్న కుమార్తె సైని (3) సహా తాను ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. చిన్నపాప గొంతుకు ఉరి బిగుసుకోకపోవడంతో గోడ సజ్జను పట్టుకొని కేకలు వేసింది. స్థానికులు విని.. ఆరు బయట పడుకున్న తండ్రి వెంకటేశ్‌ని లేపారు. పైకప్పు రేకుల్ని పగలగొట్టి లోపలకి దిగిన వెంకటేశ్‌ సజ్జ పట్టుకుని వేలాడుతున్న చిన్న కుమార్తెను కాపాడాడు. అప్పటికే ఉమారాణి, ఇద్దరు పిల్లలు ప్రాణాలు విడిచారు. వెంకటేశ్‌ వేధింపుల వల్లే తన చెల్లెలు మృతిచెందిందని ఆమె అన్న మల్లేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన