పథకం ప్రకారమే పాజిటివ్‌ రిపోర్టు

ప్రధానాంశాలు

Updated : 10/07/2021 05:18 IST

పథకం ప్రకారమే పాజిటివ్‌ రిపోర్టు

అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ అతితెలివి 
నమూనాలు మార్చేసిన ల్యాబ్‌ నిర్వాహకులు

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, కంటోన్మెంట్‌: హఫీజ్‌పేట భూముల వ్యవహారంలో ప్రవీణ్‌రావు సోదరులను అపహరించిన కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ రెండోసారి పోలీసులకు చిక్కాడు. పోలీసులకు కరోనా నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించాడని అతనిపై బోయిన్‌పల్లి ఠాణాలో రెండో కేసు నమోదయ్యింది. ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో న్యాయస్థానంలో విచారణకు హాజరయ్యేందుకు ఇష్టం లేని అతను.. తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందంటూ పోలీసులను తప్పుదోవ పట్టించాడు. తొలుత నిజమేనని నమ్మిన పోలీస్‌ అధికారులు.. అనంతరం విచారణ చేపట్టి సాక్ష్యాధారాలు సేకరించారు. ఉత్తుత్తి పాజిటివ్‌ రిపోర్టుగా తేల్చారు. నకిలీ ధ్రువపత్రాన్ని ఇచ్చిన గాయత్రి ల్యాబ్‌ లైసెన్స్‌ రద్దు చేయాలంటూ వైద్యారోగ్యశాఖకు లేఖ రాశారు.

వాట్సాప్‌ సందేశం పట్టించింది..

కోర్టు విచారణకు హాజరు కాలేనంటూ భార్గవరామ్‌ బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌కు గత శనివారం కరోనా పాజిటివ్‌ రిపోర్టును వాట్సాప్‌లో పంపించాడు. న్యాయస్థానంలో ఈ విషయాన్ని వివరించేందుకు ఇన్‌స్పెక్టర్‌ సిద్ధమయ్యారు. సదరు సందేశాన్ని ఉన్నతాధికారులకు పంపించారు. దాన్ని చూసిన ఉన్నతాధికారికి.. అందులో అక్షరాలు, పేర్లలో దిద్దుబాటు ఉందని అనుమానం వచ్చింది. పాజిటివ్‌ రిపోర్టు ఇచ్చిన గాయత్రి ల్యాబ్‌కు వెళ్లమని ఆదేశించారు. పోలీసులు కూకట్‌పల్లిలోని ల్యాబ్‌లో నిర్వాహకులు వినయ్‌, రత్నాకర్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. తాము రూ.1200 తీసుకుని పాజిటివ్‌ రిపోర్టు ఇచ్చామంటూ వివరించారు.

దొరికిన సాక్ష్యాధారాలు..

కరోనా లేకున్నా పాజిటివ్‌ రిపోర్టు తీసుకునేందుకు భార్గవరామ్‌ పదిరోజుల క్రితమే పథకం వేశాడు. ఇందుకు అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత్‌రెడ్డి సహకరించాడు. కూకట్‌పల్లిలోని ప్రతిమ ఆసుపత్రిలో పనిచేస్తున్న వినయ్‌ తన స్నేహితుడని.. అతడికి చెబితే పనైపోతుందని, అడిగినంత డబ్బు ఇచ్చేద్దామని చెప్పాడు. వినయ్‌ సూచన మేరకు భార్గవరామ్‌.. గాయత్రి ల్యాబ్‌కు వెళ్లాడు. అక్కడ కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నాడు. నెగెటివ్‌ వచ్చినా.. పాజిటివ్‌ వచ్చినట్టు వారు రిపోర్టు ఇచ్చారు. ల్యాబ్‌కు వెళ్లిన పోలీసులు మొత్తం వ్యవహారంపై సాక్ష్యాధారాలు సేకరించారు. భార్గవరామ్‌ అక్కడ ఏం చేశాడు? నమూనాలను ల్యాబ్‌ నిర్వాహకులు ఎలా మార్చారు? తదితర అంశాలకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించారు. ఒక నమునా బదులు మరో నమూనా ఉంచడం, కొవిడ్‌ రిపోర్టుపై పాజిటివ్‌ అంటూ రాయడం వంటివాటికి సంబంధించిన రుజువులు సేకరించారు. పరారీలో ఉన్న భార్గవరామ్‌, జగద్విఖ్యాత్‌రెడ్డిని అరెస్ట్‌ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏపీ, మహారాష్ట్రకు వెళ్లాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన