కరెంటు తీగకు బలయ్యారు

ప్రధానాంశాలు

Updated : 11/07/2021 12:31 IST

కరెంటు తీగకు బలయ్యారు

 పొలం పనులు చేస్తుండగా విద్యుదాఘాతం

తొర్రూరు టౌన్‌, న్యూస్‌టుడే: పొలం పనుల్లో భాగంగా కిందకు వేలాడుతున్న విద్యుత్తు తీగను సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు రైతులు మృతిచెందారు. ఈ విషాదం మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోజ్యా తండాకు చెందిన మాలోతు యాకూబ్‌(43) పొలాన్ని ట్రాక్టర్‌తో దున్నించడానికి కిందకు వేలాడుతున్న సర్వీస్‌ వైర్‌ను సరి చేసేందుకు పక్క పొలంలో పని చేస్తున్న భూక్య సుధాకర్‌(28) సహాయాన్ని తీసుకున్నాడు. విద్యుత్తు స్తంభం నుంచి స్టార్టర్‌ డబ్బాకు వచ్చిన సర్వీస్‌ తీగతో జే వైర్‌ ఉండగా సర్వీస్‌ వైర్‌ ఫెయిల్‌ కావడంతో జే వైర్‌కు విద్యుత్తు సరఫరా అయింది. రెండు తీగలు ఒకదాంతో ఒకటి తాకడంతో విద్యుదాఘాతంతో వారిద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అప్పటి వరకు వ్యవసాయ పనుల్లో చురుకుగా ఉన్నవారు విగతజీవులు కావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. యాకూబ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. సుధాకర్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామన్నారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన