అవి అశ్లీల చిత్రాలు కావు

ప్రధానాంశాలు

Published : 24/07/2021 04:35 IST

అవి అశ్లీల చిత్రాలు కావు

బాంబే హైకోర్టులో రాజ్‌ కుంద్రా

శిల్పాశెట్టి ఇంట్లో అధికారుల ఆరా

ముంబయి: పోర్న్‌ చిత్రాల నిర్మాణం కేసులో అరెస్టైన ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తాను నిర్మించిన సినిమాలు పోర్న్‌ చిత్రాల కిందకు రావని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందులో పాత్రధారుల వాంఛను వ్యక్తపరిచే సన్నివేశాలే తప్ప, నేరుగా లైంగిక ప్రక్రియను చూపించే దృశ్యాలు లేవని తెలిపారు. కాబట్టి తనను ఐటీ చట్టంలోని సెక్షన్‌ 67ఏ(అశ్లీల సమాచార ప్రచురణ, ప్రసారం) కింద అరెస్టు చేయడం అక్రమమని పేర్కొన్నారు. దీంతోపాటు తనకు ముందస్తు నోటీసులు ఇచ్చి వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా నేరుగా అరెస్టు చేశారని తెలిపారు. పోలీస్‌ కస్టడీని విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని అభ్యర్థించారు. కుంద్రా తన సంస్థ వియాన్‌ ద్వారా ముంబయిలో అశ్లీల చిత్రాలు నిర్మించి బ్రిటన్‌లోని తన బంధువు సాయంతో అక్కడి నుంచి హాట్‌షాట్స్‌ అనే యాప్‌లో వాటిని అప్‌లోడ్‌ చేస్తున్నారన్న అభియోగాలతో ఈనెల 19న ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు శిల్పాశెట్టిని విచారించారు. శుక్రవారం కుంద్రాను వెంటబెట్టుకుని ఆయన ఇంటికి వెళ్లి శిల్పాశెట్టిని ప్రశ్నించారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని వెళ్లారు. అంతకు ముందు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు చర్చనీయాంశం అయింది. గతంలో తాను ఎన్నో సవాళ్లను అధిగమించానని, ఇప్పడూ వాటిని ఎదుర్కొంటానని.. తన జీవితాన్ని ఏదీ ప్రభావితం చేయలేదని అందులో వ్యాఖ్యానించారు. 

27 వరకూ కస్టడీ పొడిగింపు

కుంద్రా అరెస్టు సమయంలో 23 వరకూ పోలీస్‌ కస్టడీని విధించిన మేజిస్ట్రేట్‌ కోర్టు శుక్రవారం దాన్ని 27 వరకూ పొడిగించింది. దీన్ని కుంద్రా హైకోర్టులో సవాల్‌ చేశారు. తనపై పెట్టిన సెక్షన్ల కింద 7 ఏళ్లకు మించి జైలు శిక్ష పడదని, అలాంటి సందర్భాల్లో ముందస్తు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంందని, కానీ నిబంధనలకు విరుద్ధంగా నేరుగా అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, కుంద్రా కార్యాలయంలో చేసిన సోదాల్లో టెరాబైట్ల కొద్దీ పోర్న్‌ వీడియోలు లభ్యమైనట్లు దర్యాప్తు బృంద సన్నిహిత వర్గాలు తెలిపాయి. భారీ ఎత్తున డేటాను తొలగించినట్లు తేలిందని, దాన్ని వెలికి తీసేందుకు ఫోరెన్సిక్‌ నిపుణుల సాయం తీసుకుంటున్నట్లు చెప్పాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన