TS News: బండి ఎక్కించుకుంటారు.. అడవిలో అంతమొందిస్తారు

ప్రధానాంశాలు

Published : 29/07/2021 06:41 IST

TS News: బండి ఎక్కించుకుంటారు.. అడవిలో అంతమొందిస్తారు

మాయమాటలతో హత్యలు... ఆభరణాల చోరీ

పోలీసుల అదుపులో దంపతులు

ఈనాడు, హైదరాబాద్‌: మహిళల ఒంటిపై కాస్త బంగారం కనిపిస్తే చాలు.. ఆ దంపతులు మాయమాటలతో మభ్యపెడతారు. కూలి పని ఇప్పిస్తామని నమ్మించి బండిపై ఎక్కించుకుంటారు. దగ్గర్లోని అటవీ ప్రాంతాల్లోకి తీసుకెళ్లి దారుణంగా హత్య చేస్తారు. ఆమె వద్ద ఆభరణాలు, డబ్బు దోచుకుని పరారవుతారు. ఇలా దారుణాలకు పాల్పడుతున్న దంపతులను దుండిగల్‌ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ తరహాలో ఎనిమిది మందిని హతమార్చినట్లు భర్త, 12 మందిని చంపామని భార్య చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. వారు చెప్పిన సమాచారం మేరకు దర్యాప్తు చేసి, కొన్ని ఆధారాలను గుర్తించారు. ఈ వివరాలను ఒకటి, రెండు రోజుల్లోనే అధికారికంగా వెల్లడించే అవకాశముంది.

ఎలా చిక్కారంటే...  

రెండు, మూడు రోజుల కిందట ఓ మహిళ అదృశ్యమైనట్లు.. ఆమె కుటుంబ సభ్యులు దుండిగల్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. అదే రోజు రాత్రి పోలీసులు కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు. ఆ మహిళ పని కోసం రోజూ లేబర్‌ అడ్డాకు వెళ్తుందని చెప్పడంతో.. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆమె మరో ఇద్దరితో కలిసి ఓ ద్విచక్ర వాహనంపై వెళ్లినట్లు గుర్తించారు. బండి నెంబరు ఆధారంగా చుట్టుపక్కల ఆరా తీసి, ఓ చిరునామాకు వెళ్లారు. ఆ సమయంలోనే ఇల్లు ఖాళీ చేస్తున్న భార్యాభర్తలను ఠాణాకు తరలించారు. అదృశ్యమైన మహిళను సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి తామే హతమార్చినట్లు ఆ దంపతులు అంగీకరించారు. వారిచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు వెళ్లి, మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన