బెయిల్‌ ఇవ్వలేదన్నకక్షతో జడ్జి హత్య

ప్రధానాంశాలు

Published : 30/07/2021 05:45 IST

బెయిల్‌ ఇవ్వలేదన్నకక్షతో జడ్జి హత్య

ఝార్ఖండ్‌లో దారుణం 
దర్యాప్తునకు సిట్‌ ఏర్పాటు

దిల్లీ: బెయిల్‌ మంజూరు చేయలేదన్న కక్షతో కొందరు దుండగులు ఝార్ఖండ్‌లోని ఓ జిల్లా జడ్జిని ఆటోతో ఢీ కొట్టించి హత్య చేయడం సంచలనం కలిగించింది. వ్యవహారం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లడంతో ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేయించాలని ఝార్ఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ధన్‌బాద్‌లోని జిల్లా సెషన్స్‌ జడ్జి-8 ఉత్తం ఆనంద్‌ బుధవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో నడకకు వెళ్లిన సమయంలో హత్యకు గురయ్యారు. జిల్లా కోర్టుకు సమీపంలోని రణధీర్‌ వర్మ చౌక్‌ వద్ద ఓ ఆటో ఆయనను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు. రక్తం మడుగులో ఉన్న ఆయనను ఓ ఆటో రిక్షా డ్రైవరు చూసి సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. తొలుత ఆయనను ఆసుపత్రి సిబ్బంది గుర్తు తెలియని వ్యక్తిగానే పరిగణించారు. ఉదయం ఏడు గంటలైనా జడ్జి ఆనంద్‌ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఆసుపత్రి వద్దకు వచ్చిన జడ్జి బాడీగార్డు ఆయనను గుర్తుపట్టారు. హత్య కేసులో అరెస్టయిన అమన్‌సింగ్‌ గ్యాంగ్‌కు చెందిన ఓ కరుడుగట్టిన నేరగాడికి బెయిల్‌ నిరాకరించినందువల్లనే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని స్థానిక న్యాయవాదులు అభిప్రాయడ్డారు.

గురువారం సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌ ఈ విషయాన్ని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. నిందితులు హత్యాకాండను వీడియో తీశారని చెప్పారు. సాక్ష్యంగా ఉపయోగపడుతుందని తెలిసి ఎందుకు వీడియో తీశారని జస్టిస్‌ షా ప్రశ్నించగా ప్రజలను భయభ్రాంతుల్ని చేయడానికే ఇలా చేసి ఉంటారని సమాధానం ఇచ్చారు. అనంతరం ఆయన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌ల ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఇది న్యాయవ్యవస్థపై జరిగిన దాడి అని ఆరోపించారు. బెయిల్‌ ఇవ్వనందుకు జడ్జిని హత్య చేసేందుకూ వెనుకాడలేదంటే దేశంలో న్యాయవ్యవస్థ ఎలా మనుగడ సాగించగలదని ఆవేదన వ్యక్తం చేశారు.  దీనిపై జస్టిస్‌ రమణ స్పందిస్తూ ఇప్పటికే ఝార్ఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడానని చెప్పారు. దీనిపై దర్యాప్తునకు అదనపు డీజీపీ సంజయ్‌ లౌట్కర్‌ ఆధ్వర్యంలో ‘సిట్‌’ ఏర్పాటు చేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రవి రంజన్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కేసులో ఇంతవరకు ఇద్దర్ని అరెస్టు చేసినట్టు ధన్‌బాద్‌ సీనియర్‌ ఎస్పీ సంజీవ్‌ కుమార్‌ చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన