పాపం పసివాళ్లు!

ప్రధానాంశాలు

Published : 01/08/2021 05:17 IST

పాపం పసివాళ్లు!

 తండ్రితో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఢీకొట్టిన లారీ

  ఇద్దరు చిన్నారుల దుర్మరణం

ఉండవల్లి, న్యూస్‌టుడే: ఇద్దరు చిన్నారుల్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళుతున్న తండ్రి.. జాగ్రత్తగా జాతీయ రహదారికి ఎడమవైపున నిదానంగా ప్రయాణిస్తున్నారు. ఇంతలో ఎదురుగా రాంగ్‌రూట్‌లో ట్రాక్టర్‌ వస్తుండడాన్ని గమనించారు. ఇంకా ఎడమవైపునకు వెళ్లడానికి వీలులేకుండా అక్కడ రెయిలింగ్‌ అడ్డుగా ఉండడంతో.. కొంచెం కుడివైపునకు మళ్లారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ వారిని ఢీకొంది.  మృత్యువు ఎరవేసినట్లుగా జరిగిన ఈ ప్రమాదంలో అభం శుభం తెలియని ఇద్దరు బిడ్డలు బలవ్వగా.. ఆ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండల పరిధిలో జాతీయ రహదారి 44పై శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై జగన్‌మోహన్‌ కథనం ప్రకారం.. జిల్లాలోని మానవపాడు మండలం చెన్నిపాడుకు చెందిన రవికుమార్‌ తన కుమారుడు రిషి(9), కుమార్తె నిషిత(6)ని తీసుకుని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కర్నూలు జిల్లా ఈ.తాండ్రపాడులోని తన అన్న ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. జాతీయ రహదారి వెంబడి మొక్కలకు అమర్చడానికి ట్రీగార్డులతో పుల్లూరుకు చెందిన ట్రాక్టరు వ్యతిరేక దిశలో వస్తుండగా.. దానిని తప్పించేందుకు రవి ద్విచక్ర వాహనాన్ని కొంత కుడివైపు తిప్పారు. అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి కర్నూలు వెళుతున్న తమిళనాడుకు చెందిన లారీ వీరి వాహనాన్ని వెనుకనుంచి ఢీ కొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై నుంచి పడిపోయిన ఇద్దరు చిన్నారులు లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతిచెందారు. తండ్రికి స్వల్పంగా గాయాలయ్యాయి. రవికుమార్‌, పుష్పలత దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా రెండో కుమారుడు, కుమార్తె ఈ ప్రమాదంలో మృతి చెందారు. రిషి స్థానిక పాఠశాలలో 4వ తరగతి, నిషిత 2వ తరగతి చదువుతున్నారు. చిన్నారుల మృతదేహాలను అలంపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడికి చేరుకున్న తల్లి పుష్పలత రోదనలు అందరితో కంటతడి పెట్టించాయి. తండ్రి రవికుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ట్రాక్టరు, లారీని ఉండవల్లి ఠాణాకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన