పోలీసులు, పెద్దమనుషుల తీరుతో మనస్తాపం..యువకుడి ఆత్మహత్య

ప్రధానాంశాలు

Published : 02/08/2021 08:35 IST

పోలీసులు, పెద్దమనుషుల తీరుతో మనస్తాపం..యువకుడి ఆత్మహత్య

 

ఇల్లంతకుంట, న్యూస్‌టుడే: తనకు జరిగిన ప్రమాదానికి యజమాని నుంచి రావాల్సిన పరిహారం రానీయకుండా కొందరు అడ్డుకుంటున్నారంటూ ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రాహింఖాన్‌పేటలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. కుటుంబసభ్యులు, ప్రొబేషనరీ ఎస్సై దిలీప్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వంశీ (21) ఒకరి వద్ద ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితం గడ్డికట్టల యంత్రంలో అతడి కుడి చేయి పడి తీవ్రంగా గాయమైంది. వైద్యులు ఆ చేతిని తొలగించారు. ట్రాక్టర్‌ యజమాని పరిహారం చెల్లించాలని పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పందం జరిగింది. ఆ సొమ్ము అందకపోవడంతో ఇటీవల వంశీ కుటుంబ సభ్యులు ట్రాక్టర్‌ను తమ ఇంటికి తీసుకురాగా, పోలీసులు హెచ్చరించి, దానిని స్టేషన్‌కు తరలించారు. మనస్తాపం చెందిన వంశీ శనివారం పురుగుమందు తాగడంతో కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించారు. అతడు ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు.

తనకు రావాల్సిన పరిహారాన్ని పోలీసులు, పెద్దమనుషులు కలిసి అడ్డుకుంటున్నారంటూ వంశీ తన ఫోన్లో రికార్డు చేసిన సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చిన సమయంలో వంశీ బంధువులు, మిత్రులు అంబులెన్స్‌ అద్దాలు పగులగొట్టారు. మృతదేహాన్ని ట్రాక్టర్‌ యజమాని ఇంటి ముందు పెట్టి ఆందోళనకు దిగారు. సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌, సీఐ ఉపేందర్‌, అనిల్‌కుమార్‌ అక్కడికి చేరుకుని వంశీ మృతికి కారణమైన వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన