మద్యం తాగేసి తోలారు..ప్రాణం తీశారు!

ప్రధానాంశాలు

Updated : 03/08/2021 06:11 IST

మద్యం తాగేసి తోలారు..ప్రాణం తీశారు!

అర్ధరాత్రి కారు బోల్తా.. యువతి దుర్మరణం

మరొకరి పరిస్థితి విషమం.. ఇద్దరికి తప్పిన ముప్పు

 స్నేహితుల దినోత్సవం రోజే విషాదం

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: ఒక్కగానొక్క కుమార్తె.. ఎన్నో నోములు నోచి, పూజలు చేసినందుకు మహాలక్ష్మి పుట్టిందని అపురూపంగా పెంచుకున్నారు. ఉన్నత చదువులకు కెనడా వెళ్లి వారం కిందట ఇంటికొచ్చిన ఆమెను చూసి మురిసిపోయారు. స్నేహితుల దినోత్సవం రోజు మిత్రులను కలిసేందుకు వెళ్తానంటే పంపించారు. అదే చివరి చూపవుతుందని ఊహించలేదంటూ ఆ తల్లిదండ్రులు రోదిస్తుంటే ఓదార్చడం ఎవరి తరం కాలేదు. మద్యం మత్తులో డ్రైవింగ్‌ ఆ యువతి ప్రాణాలను బలి తీసుకోగా, మరో యువతి పరిస్థితి విషమంగా ఉంది. గచ్చిబౌలి ఠాణా పరిధిలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గతేడాది బీబీఏ పూర్తి చేసి...

తెల్లాపూర్‌ బొన్సాయ్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న డి.వినయ్‌కుమార్‌ ఎంఆర్‌ఎఫ్‌ సంస్థ ఉద్యోగి. ఆయన కుమార్తె డి.ఆశ్రిత(23), తరుణి(23), సాయిప్రకాష్‌(23) శంకర్‌పల్లిలోని ఇక్ఫాయ్‌ బిజినెస్‌ స్కూల్‌లో గత ఏడాది బీబీఏ పూర్తిచేశారు. సాయిప్రకాష్‌ మాదాపూర్‌లోని విజువల్‌ హ్యాష్‌ టెక్నాలజీస్‌లో, తరుణి రాయదుర్గంలోని వెల్స్‌ఫార్గో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆశ్రిత ఉన్నత చదువులకు కెనడా కెళ్లింది. వీరి జూనియర్‌ మదీనాగూడలో ఉండే అభిషేక్‌(21) తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా కెనడాలో ఉంటున్నారు. ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో ఈ నలుగురూ కలవాలనుకున్నారు. మదీనాగూడలో ఉండే స్నేహితులు వివేక్‌(22), చిన్మయ్‌(22)ను ఆహ్వానించారు.

బండరాళ్లను ఢీకొట్టి.. పల్టీకొట్టి

అభిషేక్‌ తన కారులో సాయిప్రకాష్‌తో కలిసి ఆశ్రిత ఇంటికి వెళ్లాడు. అక్కడే ఉన్న తరుణితో కలిసి నలుగురూ మాదాపూర్‌ హైటెక్స్‌ రోడ్డులోని స్నార్ట్‌ పబ్‌కు రాత్రి 10 గంటలకు వెళ్లారు. మిగిలిన ఇద్దరు మరో కారులో వచ్చారు. అభిషేక్‌, సాయిప్రకాష్‌ మద్యం తాగారు. రాత్రి 11 గంటలకు మదీనాగూడలోని అభిషేక్‌ ఇంటికి బయలుదేరారు. అభిషేక్‌ కారులో సాయిప్రకాష్‌, ఆశ్రిత, తరుణి ఉన్నారు. రాత్రి 11.30 ప్రాంతంలో కొండాపూర్‌లోని మైహోం మంగళ అపార్టుమెంట్స్‌ వద్ద అభిషేక్‌ కారు అదుపు తప్ఫి. బండరాళ్లను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. కారు డోరు తెరుచుకోవడంతో ఆశ్రిత రోడ్డుపై ఎగిరి పడింది. పక్కనే కూర్చున్న తరుణి లోపలే ఇరుక్కుపోయింది. ఎయిర్‌ బెలూన్లు తెరుచుకోవడంతో సాయిప్రకాష్‌, అభిషేక్‌ స్వల్పగాయాలతో బయటపడ్డారు. వివేక్‌, చిన్మయ్‌.. క్షతగాత్రులను ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా, ఆశ్రిత మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. తరుణి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అభిషేక్‌ మద్యం తాగి.. వేగంగా కారు నడపటం వల్లే ఘటన జరిగినట్లు పోలీసులు తేల్చారు. అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మద్యం విక్రయాలపై నిషేధమున్నా విక్రయించినందుకు స్నార్ట్‌ పబ్‌పై కేసు నమోదు చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన