వివేకా హత్య కేసులో సునీల్‌ యాదవ్‌ అరెస్టు

ప్రధానాంశాలు

Updated : 04/08/2021 06:10 IST

వివేకా హత్య కేసులో సునీల్‌ యాదవ్‌ అరెస్టు

నేడు ఏపీకి తీసుకురానున్న అధికారులు

ఈనాడు, అమరావతి, ఈనాడు డిజిటల్‌, కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు అనుమానితుల్లో ఒకరైన వైకాపా కార్యకర్త యాదటి సునీల్‌ యాదవ్‌ను (26) సీబీఐ అరెస్టు చేసింది. కొన్ని రోజులుగా పరారీలో ఉన్న ఆయనను సోమవారం రాత్రే గోవాలో అదుపులోకి తీసుకున్న అధికారులు ట్రాన్సిట్‌ వారెంట్‌ కోసం మంగళవారం అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచారు. బుధవారం ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. ఈ విషయాన్ని దిల్లీలోని సీబీఐ ప్రజాసంబంధాల అధికారి ధ్రువీకరించారు.  వివేకా హత్యకు ముందు, ఆ తర్వాత సునీల్‌ యాదవ్‌ కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ ఏడాది మార్చిలో అతన్ని దిల్లీ పిలిపించి కొన్ని రోజుల పాటు విచారించింది.  ఆ తర్వాత కొన్ని రోజులకు సునీల్‌ యాదవ్‌, ఆయన కుటుంబ సభ్యులు పులివెందులలోని వారి ఇంటికి తాళం వేసి పరారయ్యారు. సునీల్‌ యాదవ్‌ కోసం గాలిస్తున్న సీబీఐ అధికారులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. 

ఎవరీ సునీల్‌ యాదవ్‌?

పులివెందుల మండలం మోట్నూంతలపల్ల్లి గ్రామానికి చెందిన సునీల్‌ యాదవ్‌ తండ్రి కృష్ణయ్య.. కొన్నేళ్ల కిందట అనంతపురం వెళ్లి స్థిరపడ్డారు. మద్యం దుకాణం నిర్వహించటంతోపాటు, ఆటోమొబైల్‌ ఫైనాన్స్‌ సంస్థలో పని చేశారు. ఆర్థికంగా కుదేలవ్వటంతో 2016లో తిరిగి పులివెందులకు చేరుకున్నారు. భాకరాపురంలోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ కుటుంబం అంతా వైకాపా సానుభూతిపరులు. సునీల్‌ యాదవ్‌ ఆ పార్టీ కార్యకర్త. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓ ఇసుక రీచ్‌లో పొరుగుసేవల ప్రాతిపదికన కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేశాడు. వివేకానందరెడ్డి సన్నిహితుడు ఎర్రగంగిరెడ్డి, ఆయన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన దస్తగిరి ద్వారా సునీల్‌ యాదవ్‌ వివేకాకు పరిచయమయ్యారు. ఆ తర్వాత అతను తరచూ వివేకా ఇంటికి వెళ్లేవాడు. వారి మధ్య పలు లావాదేవీలు నడిచినట్లు సమాచారం.

ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిని విచారించిన సీబీఐ

అనుమానితులైన ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలను సీబీఐ అధికారులు మంగళవారం కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో విచారించారు. వాచ్‌మెన్‌ రంగన్న వెల్లడించిన సమాచారం ఆధారంగా వివరాలు రాబట్టినట్లు తెలిసింది.  కడప కేంద్ర కారాగారం వద్ద పోలీసు దళాలతో భద్రత ఏర్పాటు చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన