విశ్వచైతన్య స్వామి అరెస్ట్‌

ప్రధానాంశాలు

Published : 04/08/2021 05:54 IST

విశ్వచైతన్య స్వామి అరెస్ట్‌

రూ.26 లక్షల నగదు, అర కిలో బంగారు ఆభరణాలు స్వాధీనం

ఈనాడు, నల్గొండ: భక్తి ముసుగులో అమాయక ప్రజలను మోసం చేస్తున్న విశ్వచైతన్య స్వామితో పాటు అతని ముగ్గురు శిష్యులను నల్గొండ జిల్లా పోలీసులు మంగళవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. మాయమాటలతో పలువురు భక్తులను మోసం చేశారనే ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. నిందితుల నుంచి రూ.26 లక్షల నగదు, అరకిలో బంగారం, రూ.కోటిన్నర విలువ చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ బాండ్లు, 17 ఎకరాల భూమి పత్రాలు, ఏడు ల్యాప్‌ట్యాప్‌లు, 4 సెల్‌ఫోన్లు, ఒక కారు, రూ.50 లక్షలు విలువ చేసే వివిధ రకాల మూలికలు స్వాధీనం చేసుకున్నారు.  దీనికి సంబంధించి ఎస్పీ రంగనాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామకు చెందిన విశ్వచైతన్య డిగ్రీ పూర్తి చేసి 2002లో హైదరాబాద్‌లోని నల్లకుంటలో కంప్యూటర్‌ సెంటర్‌ ప్రారంభించాడు. అక్కడికి వచ్చిన వినియోగదారుల నుంచి సుమారు రూ.కోటి అప్పు చేసి పారిపోయాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా 20 రోజులు జైళ్లో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చాడు. అనంతరం 2017లో సొంతంగా శ్రీ సాయి సర్వస్వం పేరుతో యూట్యాబ్‌ ఛానల్‌ను ప్రారంభించి భక్తులకు సెల్‌ఫోన్‌లోనే సూచనలు, సలహాలు ఇచ్చేవాడు. మూడేళ్ల క్రితం నల్గొండ జిల్లాలోని పీఏ పల్లి మండలం అజ్మాపురంలో శ్రీసాయి సర్వస్వం మాన్సి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాడు. బాబా ప్రవచనాల పేరుతో మహిళలను ఆకర్షించి లోబర్చుకునేవాడు.  వారి నుంచి రూ.లక్షల నగదు, నగలు విరాళంగా పొందేవాడు. ఇవే కాకుండా రకరకాల వనమూలికలను హైదరాబాద్‌లో కొనుగోలు చేసి ఆశ్రమంలో ఎక్కువ ధరకు భక్తులకు విక్రయించేవాడు. ఇలా మోసపోయిన ఓ భక్తురాలు ఇచ్చిన ఫిర్యాదుతో విశ్వచైతన్య మోసాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ప్రధాన నిందితుడు విశ్వచైతన్య (50)తో పాటు అతని శిష్యులైన అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నివాసి గాజుల గౌతమ్‌ (26), ఖమ్మం పట్టణానికి చెందిన వంగారపు సృజన్‌ కుమార్‌ (28), నాగర్‌కర్నూల్‌ జిల్లా అమన్‌గల్‌కు చెందిన ఓర్సు విజయ్‌(25) ఉన్నారు. వీరిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన