టీకా నూనె పేరిట రూ.11.68 కోట్లు దోచేశారు

ప్రధానాంశాలు

Published : 06/08/2021 05:09 IST

టీకా నూనె పేరిట రూ.11.68 కోట్లు దోచేశారు

 వైద్యుడిని బురిడీ కొట్టించిన సైబర్‌ నేరస్థులు

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, నారాయణగూడ: ఇప్పటి వరకూ కనీవినీ ఎరుగని రీతిలో అతిపెద్ద సైబర్‌ నేరం నగరంలో నమోదైంది. ఆగ్రో మెటాజైన్‌ అనే నూనె రాయగఢ్‌లో ఉందని దాన్ని పంపితే రూ.కోట్లలో లాభం వస్తుందంటూ సైబర్‌ నేరస్థులు హైదరాబాద్‌కు చెందిన వైద్యుడిని మోసం చేశారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ చంద్రశేఖర్‌ రావు(82) అమెరికాలో స్థిరపడ్డారు. అమీర్‌పేటలోని తన ఇంటికి ఏటా వచ్చి కొద్ది రోజులు గడిపి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చిలో అమెరికా నుంచి వచ్చారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు లేకపోవడంతో ఇక్కడే ఉండిపోయారు. ఆయనకు బెంజిమెన్‌ పేరుతో నేరస్థుడు ఈ-మెయిల్‌ పంపించాడు. బ్రిటన్‌లోని ప్రముఖ ఫార్మా కంపెనీ ప్రతినిధిగా చెప్పుకొన్నాడు. కరోనా జంతువులకు రాకుండా అమెరికా, బ్రిటన్‌లలో భారీ స్థాయిలో టీకా కార్యక్రమం కొనసాగుతోందని తెలిపాడు.

ఇందుకు అవసరమైన ఆగ్రో మెటాజైన్‌ అనే ఆయిల్‌ను రాయగఢ్‌లో ఓ కంపెనీ తయారు చేస్తోందని చెప్పాడు. భారత కరెన్సీలో రూ.10 లక్షలకు కిలో ఇస్తున్నారని.. దాన్ని మీరు కొంటే మీదగ్గర మేం రూ.17లక్షలకుకొంటామంటూ వివరించాడు. ఇందుకు అంగీకరించిన డా.చంద్రశేఖర్‌ నూనెను తయారు చేస్తున్న కంపెనీ యజమాని లక్ష్మితో మాట్లాడారు. గీతానాథ్‌ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమై తాను అగ్రో మెటాజైన్‌ను లండన్‌కు పంపుతున్నానని, లాభాలొస్తున్నాయని చెప్పాడు. దీంతో వైద్యుడు తొలుత కిలో నూనెను పంపించమని లక్ష్మిని కోరారు. ముందుగా తమకు 10 కిలోలు కావాలన్న బెంజిమెన్‌ వైద్యుడికి ఫోన్‌ చేసి 350కిలోల నూనె అవసరమని చెప్పాడు. దీంతో ఆయన నూనెను కొనేందుకు లక్ష్మి సూచించిన ఖాతాల్లో మార్చినుంచి మేవరకు దశల వారీగా 16.25 లక్షల డాలర్లు(రూ.11.68 కోట్లు) నగదు బదిలీ చేశారు. ఇంకా నగదు బదిలీ చేయాలని డిమాండ్‌ చేస్తుండడంతో బాధితుడు గురువారం సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు జరిగిన సైబర్‌ నేరాల్లో ఇదే అత్యధిక మొత్తమని సంయుక్త కమిషనర్‌(నేర పరిశోధన) అవినాష్‌ మహంతి తెలిపారు. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మొరిల్లా శాఖలో 6ఖాతాలకు, దుబాయ్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా శాఖలోని 3ఖాతాలకు మొత్తం 16.25లక్షల డాలర్లు బదిలీ అయినట్టు గుర్తించారు. నిందితులు మాట్లాడిన ఫోన్‌నంబర్లు, మెయిల్‌ చిరునామాల ఆధారంగా పరిశోధన కొనసాగిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన