పోలీసులు పట్టుకున్నారని.. ఆత్మహత్యాయత్నం

ప్రధానాంశాలు

Published : 06/08/2021 05:09 IST

పోలీసులు పట్టుకున్నారని.. ఆత్మహత్యాయత్నం

 మద్యం తరలిస్తుండగా అడ్డుకున్న పోలీసులు
 చికిత్స పొందుతూ యువకుడి మృతి
  పోలీసులు కొట్టడం వల్లేనని ఆరోపణ

దాచేపల్లి (భట్రుపాలెం), న్యూస్‌టుడే: అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకోవడం... ఆపై చేయి చేసుకోవడంతో ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అనంతరం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడు. మద్యం అక్రమ రవాణా చేస్తున్నవారిని గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం భట్రుపాలెం వద్ద గురువారం వేకువజామున గురజాల ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకోవడంతో వారిలో ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అనంతరం అతడిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందాడు. ఎక్సైజ్‌ ఎస్సై మోహన్‌ కథనం ప్రకారం.. తెలంగాణ వైపు నుంచి కొంతమంది యువకులు 10 మద్యం కేసులను దాచేపల్లికి తీసుకొస్తుండగా పోలీసులు పట్టుకుని, మద్యం స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకునే క్రమంలో అల్లీసా అనే యువకుడు ఎదురు తిరిగాడు. పోలీసులు అతడిపై చేయిచేసుకోగా అక్కడే పురుగుమందు తాగాడు. విషయం తెలిసిన అతని కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం అల్లీసాను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు. బాధిత కుటుంబసభ్యులు మాట్లాడుతూ అన్యాయంగా అల్లీసాను లాఠీలతో కొట్టారని, కాళ్లపై ద్విచక్రవాహనాన్ని ఎక్కించి, పొట్టపై కాళ్లతో తన్నారని చెప్పారు. పోలీసులు కొట్టడంతోనే అతను మృతిచెందినట్లు వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు తమ వెంట తెచ్చుకున్న మద్యం సీసాలను తమ వాహనంలో పెట్టి అక్రమంగా కేసు బనాయించారన్నారు. మహిళలని కూడా చూడకుండా దుర్భాషలాడినట్లు చెప్పారు.

మేం ఎవరినీ కొట్టలేదు: మద్యం అక్రమంగా తరలిస్తున్నవారి సమాచారం తెలిసి నిందితులను పట్టుకున్నాం. మేం ఎవరినీ కొట్టలేదు. మాపైనే వారు దాడులు చేశారు. అనంతరం ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అతడిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. గురువారం రాత్రి ప్రాణాలు విడిచాడు.

-మోహన్‌, ఎక్సైజ్‌ ఎస్సై, గురజాలTags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన