మణుగూరు ఉపరితల గనిలో ఘోర ప్రమాదం

ప్రధానాంశాలు

Published : 19/08/2021 04:58 IST

మణుగూరు ఉపరితల గనిలో ఘోర ప్రమాదం

బొలెరోపై నుంచి వెళ్లిన డంపర్‌

ప్రమాదంలో ఇద్దరు కార్మికులు,  డ్రైవర్‌ మృతి

మణుగూరు పట్టణం, న్యూస్‌టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా ఉపరితల గని-2లో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు సింగరేణి కార్మికులతోపాటు, ఓ వాహన డ్రైవర్‌ దుర్మరణం పాలయ్యారు. మణుగూరు సింగరేణి ఉపరితల గని-2లో డ్రిల్లింగ్‌ యంత్రాన్ని సర్వీసింగ్‌ చేసేందుకు గని కార్మికులు భాస్య (ఎలక్ట్రీషియన్‌), సాగర్‌ (జనరల్‌ మజ్దూర్‌)లను ఓ బొలెరో వాహనంలో డ్రైవర్‌ వెంకన్న తీసుకెళ్తున్నారు. ఇదే సమయంలో ఆ రహదారిలో 100 టన్నుల సామర్థ్యం కలిగిన డంపర్‌ ఓబీని లోడ్‌ చేసుకునేందుకు వెళ్తోంది. ‘ఆర్‌ఎల్‌ 765 స్థలం’ వద్ద డంపర్‌ ఆపరేటర్‌ చూసుకోకుండా ముందున్న బొలెరో వాహనంపై నుంచి డంపర్‌ను నడిపాడు. ప్రమాదంలో బొలెరో వాహనం నుజ్జునుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న భాస్య (48), సాగర్‌ (33), వాహన డ్రైవర్‌ వెంకన్న (45)లు అక్కడికక్కడే మృతి చెందారు. వాహనాన్ని కట్‌ చేసి బయటకు తీసిన మృతదేహాలను స్థానిక సింగరేణి ఆసుపత్రికి తరలించారు. భాస్యకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వెంకన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతను ఒప్పంద కార్మికునిగా పనిచేస్తున్నారు. మరో కార్మికుడు సాగర్‌ రెండేళ్ల క్రితమే కారుణ్యంతో సింగరేణి ఉద్యోగం పొందాడు. ఇతనికి ఇంకా పెళ్లి కాలేదు. మృతులు ముగ్గురూ మణుగూరు వాసులే. ఆసుపత్రిలో సింగరేణి కార్మికుల మృతదేహాలను చూసి వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని సీపీఐ నాయకులు బుధవారం రాత్రి ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని స్థానిక ఎమ్మెల్యే, విప్‌ రేగా కాంతారావు ఓ ప్రకటనలో తెలిపారు.

‘బ్లైండ్‌ యూ టర్న్‌’ మార్గం కావటంతో..

డంపర్‌ ఆపరేటర్‌ నిర్లక్ష్యం, ‘బ్లైండ్‌ యూ టర్న్‌’ మార్గం కావటం వల్లనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని అర్థమవుతోంది. భోజన విరామం అనంతరం ఆపరేటర్‌ డంపర్‌ను వేరే రహదారిలో నడిపి తీసుకెళ్లారు. కొద్దిసేపటి అనంతరం ఆ దారిలో లోడింగ్‌ వెళ్లటం సాధ్యపడదని గమనించి వెనక్కి తిప్పేందుకు యత్నిస్తున్నాడు. ఆ క్రమంలో డంపర్‌ను దాటి వెళ్తున్న బొలెరో వాహనాన్ని గమనించకుండా దాని పైనుంచి నడిపాడు. నుజ్జునుజ్జు అయిన బొలెరోను డంపర్‌ 12 మీటర్ల మేర లాక్కెళ్లి వదిలేసింది. 162 మీటర్ల దూరం తర్వాతగానీ ప్రమాదం జరిగినట్లు ఆపరేటర్‌ గుర్తించలేకపోయాడు. సాధారణంగా డంపరుకు ఎడమ వైపు ఆపరేటరు ఉంటారు. కుడి వైపు అతనికి కన్పించదు. వచ్చే వాహనాలు కన్పించేందుకు పక్కనున్న అద్దాన్ని చూసుకుంటూ వాహనాన్ని నడిపించాలి. ఈ పరిస్థితిని బ్లైండ్‌ యూ టర్న్‌గా పిలుస్తారు. ఇలాంటి మార్గంలో ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోకపోవటమూ ప్రస్తుత ఘటనకు కారణమన్న విమర్శలు ఉన్నాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన