Crime News: అన్నా.. అమ్మను, నన్నూ పొడిచేశాడు.. నువ్వు జాగ్రత్త!

ప్రధానాంశాలు

Updated : 29/08/2021 10:56 IST

Crime News: అన్నా.. అమ్మను, నన్నూ పొడిచేశాడు.. నువ్వు జాగ్రత్త!

ఆస్తి వివాదం.. సత్తెనపల్లిలో తల్లీ కుమార్తె దారుణ హత్య

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: ‘అన్నా.. అమ్మను, నన్ను శ్రీనివాస్‌ పొడిచాడు. అమ్మ చనిపోయింది. నువ్వు జాగ్రత్త..’ అన్న మాటలే ఆమెకు తుది పలుకులయ్యాయి. రక్తపుమడుగులో అచేతనంగా పడి ఉన్న అమ్మను చూస్తూ, కత్తిపోట్ల బాధను పంటిబిగువన భరిస్తూనే ఆ గర్భిణి సోదరుడికి ఫోన్‌ చేసింది. అప్రమత్తం చేసింది. రక్తపుముద్దలా మారి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూసింది. శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో విషాదాన్ని నింపింది. ఆస్తి వివాదమే ఈ జంట హత్యలకు కారణమైంది. తల్లీకుమార్తెలను వారి బంధువే హతమార్చాడు. డీఎస్పీ విజయభాస్కరరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. సత్తెనపల్లి మండలం కట్టమూరు వీఆర్వోగా పనిచేసిన కోనూరు శివప్రసాద్‌ నాలుగేళ్ల కిందట చనిపోయారు. కారుణ్య నియామకం కింద ఆయన కుమారుడు లక్ష్మీనారాయణ గుంటూరు ఆర్డీవో కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నారు. తల్లి వెంకట సుగుణ పద్మావతి(57)తో కలిసి ఆయన పట్టణంలోని నాగార్జుననగర్‌లో ఉంటున్నారు. సోదరి లక్ష్మీప్రత్యూష(31)ను పశ్చిమగోదావరి జిల్లా గణపవరానికి చెందిన సాయితేజస్వికి ఇచ్చి 5నెలల కిందటే పెళ్లి చేశారు. గర్భిణి అయిన ఆమె శ్రావణమాసం కావడంతో సారె కోసం తల్లిగారింటికి భర్తతో సహా వచ్చారు. తిరిగి అల్లుడు ఒక్కరే స్వగ్రామానికి వెళ్లారు. లక్ష్మీనారాయణ కుటుంబానికి, వారి పెదనాన్న మధుసూదనరావు కుటుంబాల మధ్య పొలం వివాదముంది. గుంటూరులో నివసిస్తున్న మధుసూదనరావు కుమారుడు శ్రీనివాసరావు శనివారం రాత్రి సత్తెనపల్లిలోని చిన్నమ్మ ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్నాడు. ఈ సమయంలో లక్ష్మీనారాయణ ఇంట్లో లేరు. కోపోద్రేకంతో పద్మావతి, లక్ష్మీప్రత్యూషలపై శ్రీనివాసరావు కత్తితో అమానుషంగా దాడి చేయడంతో వారు అక్కడికక్కడే చనిపోయారు. నిందితుడు పట్టణ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. దాడి సమయంలో సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన దృశ్యాలను పోలీసులు సేకరించారు.





Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన