పాఠ్యాంశంపై సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు

ప్రధానాంశాలు

Published : 15/09/2021 04:35 IST

పాఠ్యాంశంపై సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు

పోలీసులకు ఫిర్యాదు చేసిన రాష్ట్ర విద్య, పరిశోధన శిక్షణ సంస్థ డైరెక్టర్‌

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: మత విద్వేషాలను రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ డైరెక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు మంగళవారం రాత్రి కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి సీఐ శ్రీధర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అయిదో తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో గుణదల మేరీమాత ఉత్సవాల గురించి ప్రస్తావన ఉంది. దీనిపై కొందరు సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు పెట్టారు. ‘‘బెజవాడలో ప్రసిద్ధి గాంచిన దుర్గమ్మ తెలుగు పాఠాల నుంచి పోయి గుణదల కొత్త మాత వచ్చి చేరింది. అధికారికంగా పిల్లల మెదళ్లలోకి ప్రణాళిక ప్రకారం ఇతర మతాన్ని ఎక్కిస్తున్నారు. ఆంధ్రా.. హిందువుల నుంచి చేజారిపోయింది...జరగాల్సిన నష్టం జరిగిపోయింది... అని సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారు, ఇలా మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని ప్రతాప్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టులు పెట్టిన వ్యక్తుల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన