ఆగని అఘాయిత్యాలు

ప్రధానాంశాలు

Updated : 17/09/2021 20:11 IST

ఆగని అఘాయిత్యాలు

 సైదాబాద్‌ ఘటన మరువక ముందే మరో రెండు ఉదంతాలు

హైదరాబాద్‌లో ఎనిమిదేళ్ల, జగిత్యాల జిల్లాలో అయిదేళ్ల బాలికలపై అత్యాచారం

 24 గంటల్లోపే నిందితులను పట్టుకున్న పోలీసులు

ధూల్‌పేట, జగిత్యాల, న్యూస్‌టుడే, ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: హైదరాబాద్‌ మహానగరంలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచార ఘటనను మరవకముందే రాష్ట్రంలో మరో రెండు చోట్ల చిన్నారులపై అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌లో ఎనిమిదేళ్ల బాలికపై ఓ యువకుడు, జగిత్యాల జిల్లాలో అయిదేళ్ల చిన్నారిపై ఇంటర్‌ చదివే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నిందితులిద్దరినీ పోలీసులు నేరం జరగిన 24 గంటల్లోపే అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌లో జరిగిన సంఘటనకు సంబంధించి ఏసీపీ నరేందర్‌రెడ్డి, సీఐ రణవీర్‌రెడ్డిలు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ పశ్చిమ మండలం హబీబ్‌నగర్‌ ఠాణా పరిధిలోని మన్గార్‌బస్తీకి చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. మద్యం మత్తులో భర్త బుధవారం రాత్రి భార్యపై చేయిచేసుకోవడంతో రాత్రి 11 గంటలకు ఆమె హబీబ్‌నగర్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆయనకు  కౌన్సెలింగ్‌ చేసి అర్ధరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో ఇంటికి పంపించారు. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న పిల్లల్లో ఎనిమిదేళ్ల కుమార్తె నిద్రలేచి తల్లిదండ్రులు లేకపోవడంతో వెతకడం మొదలుపెట్టింది. బాలిక ఒంటరిగా బయటకు రావడాన్ని అదే ప్రాంతానికి చెందిన సుమిత్‌(19) గమనించాడు. చిన్నారిని సమీపంలో ఉన్న రేకులషెడ్డులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి 100కు సమాచారం అందించడంతో పాటు పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయాడు. క్షణాల్లో అక్కడికి వచ్చిన మంగళ్‌హాట్‌ పోలీసులు బాలికను చేరదీసి విషయాన్ని తెలుసుకున్నారు. వెంటనే బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. రాత్రికి రాత్రే 20 బృందాలు రంగంలోకి దిగి నిందితుడిని 24 గంటల్లోపే అరెస్ట్‌ చేశారు. అతడిని తమకు అప్పగించాలంటూ బాధితురాలి కుటుంబీకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీఐ రణవీర్‌రెడ్డి, సిబ్బంది వారికి నచ్చజెప్పి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు. సుమిత్‌ తాగుబోతని బస్తీవాసులు తెలిపారు. అతనిపై ఓ చోరీ కేసు కూడా ఉందన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని ఓ గ్రామంలో జరిగిన అత్యాచారానికి సంబంధించి ఎస్పీ సింధూ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఇంటి వద్ద తల్లిదండ్రులు లేకపోవడంతో ఒంటరిగా ఉన్న అయిదేళ్ల చిన్నారిపై పక్క ఇంట్లో ఉంటున్న ఇంటర్‌ చదివే యువకుడు(18) మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పొరిగింటి మహిళ వీళ్ల ఇంటికి రావడంతో చిన్నారిపై అత్యాచారం వెలుగులోకి వచ్చింది. రాత్రి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు జరిగిన ఘోరాన్ని తెలుసుకుని గురువారం ఫిర్యాదు చేశారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నామన్నారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన