జనజీవన స్రవంతిలోకి శారదక్క

ప్రధానాంశాలు

Updated : 18/09/2021 19:47 IST

జనజీవన స్రవంతిలోకి శారదక్క

డీజీపీ సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు హరిభూషణ్‌ భార్య

ఈనాడు, హైదరాబాద్‌: మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం- తూర్పుగోదావరి డివిజనల్‌ కమిటీ(బీకే-ఈజీ డీవీసీ) సభ్యురాలు జజ్జెరి సమ్మక్క అలియాస్‌ శారద శుక్రవారం డీజీపీ మహేందర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. కొద్దిరోజుల క్రితం కొవిడ్‌ కారణంగా మరణించిన మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌కు ఈమె భార్య. ఓవైపు భర్త మరణం.. మరోవైపు  అనారోగ్య సమస్యలతోపాటు మావోయిస్టు ఉద్యమభావజాలంపై నమ్మకం కోల్పోయిన కారణంగా ఆమె లొంగిపోయినట్లు డీజీపీ ప్రకటించారు. 5 ఎదురుకాల్పుల ఘటనల్లో ప్రమేయం ఉన్న ఆమెపై 25కేసులు నమోదైనట్లు తెలిపారు. శారదక్కపై ఉన్న రూ.5 లక్షల రివార్డుతోపాటు తక్షణ సాయంగా రూ.5 వేలను అందజేశారు. ఆమె ఉద్యమ జీవితం గురించి డీజీపీ విలేకరులకు వెల్లడించారు.

మహబూబాబాద్‌ జిల్లా గంగారం గ్రామానికి చెందిన శారద 1994లో మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లారు. అప్పటికి ఆమెకు 18 ఏళ్లు. హరిభూషణ్‌కు సమీప బంధువు కావడంతో ఆయనే శారదను పార్టీలోకి తీసుకెళ్లారు. తొలుత పాండవదళంలో సభ్యురాలిగా చేరిన శారద ఏడాది తర్వాత హరిభూషణ్‌ను వివాహం చేసుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆమె 2005-08 మధ్య చర్ల లోకల్‌ ఏరియా స్క్వాడ్‌ కమాండర్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కంటిచూపు కోల్పోవడంతో 2008 జులై 28న వరంగల్‌ ఎస్పీ ఎదుట లొంగిపోయారు. తిరిగి ఉద్యమంలోకి రాకుంటే మళ్లీ పెళ్లి చేసుకుంటానని భర్త హరిభూషణ్‌ బెదిరించడంతో 2011 నవంబరు 10న మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లారు. 2018 జనవరిలో బీకే-ఈజీ డీవీసీ కమాండర్‌గా పదోన్నతి పొంది ఇప్పటివరకు కొనసాగారు. తెలంగాణ రాష్ట్ర కమిటీలో ప్రస్తుతం గుత్తికోయల ఆధిపత్యం నడుస్తోందని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ నుంచి 100 శాతం రిక్రూట్‌మెంట్లు ఆగిపోయాయని వెల్లడించారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన