అమరావతి దళిత ఐకాస నాయకుడిపై దాడి

ప్రధానాంశాలు

Published : 19/09/2021 05:17 IST

అమరావతి దళిత ఐకాస నాయకుడిపై దాడి

కాపు కాసి కొట్టిన దుండగులు.. తలకు తీవ్ర గాయం

ఈనాడు డిజిటల్‌, అమరావతి, న్యూస్‌టుడే-తుళ్లూరు గ్రామీణం: రాజధాని అమరావతి దళిత ఐకాస నాయకుడు, రైతు పులి చిన్నా (మరియదాస్‌)పై కొందరు దాడి చేశారు. శనివారం సాయంత్రం పొలం నుంచి తిరిగి వస్తుండగా ఆయనపై దుండగులు కాపు కాసి దాడిచేశారు. కర్రలతో కొట్టడంతో ఆయన తలకు గాయమై రక్తస్రావమైంది. ఎడమ చేతికి గాయాలయ్యాయి. వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌ అనుచరులే దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలేనికి చెందిన పులి చిన్నా.. అమరావతి ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. శనివారం పొలం నుంచి ద్విచక్రవాహనంపై వస్తుండగా బొడ్రాయి సెంటరు వద్దకు రాగానే దాదాపు 10 మంది వాహనాలతో వెంబడించారు. ఆందోళనకు గురైన చిన్నా ద్విచక్రవాహనాన్ని అక్కడే వదిలేసి పరిగెత్తారు. చర్చి వద్ద ఆయన్ను పట్టుకున్న దుండగులు కర్రలతో కొట్టడంతో చిన్నాకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు దుండగుల్ని అడ్డుకుని, చికిత్స నిమిత్తం చిన్నాను విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కారణంగా రెండురోజులు ఆసుపత్రిలోనే ఉంచాలని వైద్యులు చెప్పినట్లు బాధితుడి బంధువులు తెలిపారు. ఘటనకు కొద్ది క్షణాల ముందు ఉద్దండరాయునిపాలెంలోని అమరావతి పరిరక్షణ దీక్షా శిబిరం దగ్గరికి వచ్చిన నిందితులు అక్కడే ఉన్న జెండా కర్రలను తీసుకుని బొడ్రాయి సెంటరు దగ్గర కాపు కాశారని.. చిన్నా రాగానే కొట్టారని గ్రామస్థులు తెలిపారు.

చంద్రబాబు పరామర్శ

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పులి చిన్నాను తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. అరాచక ప్రభుత్వంపై పోరాడుతున్నారంటూ అభినందించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యులతో మాట్లాడి చిన్నా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పోలీసు కేసు, బాధితుడి రక్షణకు ఏర్పాట్లు చూడాలని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యను ఆదేశించారు. పలువురు తెదేపా నాయకులు చిన్నాను పరామర్శించారు.

చంపాలని చూశారు: పులి చిన్నా

చంద్రబాబు నివాసంపై దాడి సందర్భంగా వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్‌పై వ్యాఖ్యలు చేసినందుకు వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌ అనుచరులే తనపై దాడి చేశారని, చంపడానికి ప్రయత్నించారని పులి చిన్నా ఆరోపించారు. పులి సురేశ్‌, పులి మోజేశ్‌, పులి దాసు, పులి మాణిక్యరావు తదితరులు దాడి చేశారని తెలిపారు. దాడి అనంతరం పులి చిన్నా, అమరావతి దళిత ఐకాస నాయకులతో కలసి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు తుళ్లూరు పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. రక్తస్రావం అవుతుండటంతో ఆసుపత్రికి పంపి, అక్కడే ఫిర్యాదు స్వీకరించినట్లు తుళ్లూరు సీఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు 10 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన