చదువుకుంటానంటే చంపుతానంటున్నాడు

ప్రధానాంశాలు

Published : 19/09/2021 05:17 IST

చదువుకుంటానంటే చంపుతానంటున్నాడు

పనికి వెళ్లలేదని కుమారుడిని కొట్టిన తండ్రి

చివ్వెంల, న్యూస్‌టుడే: కుమారుడికి విద్యాబుద్ధులు నేర్పి.. బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన కన్నతండ్రే కసాయిగా మారాడు. పనికి వెళ్లడం లేదని, తన మాట వినడం లేదని తీవ్రంగా కొట్టాడు. చదువుకుంటానంటే చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని కోమటికుంటలో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు, బాధిత బాలుడు తెలిపిన వివరాల ప్రకారం.. కోమటికుంటకు చెందిన గాజ రమణయ్య, మంజులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సాయిరాం(15) చిలుకూరులోని గురుకులంలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. తండ్రి బలవంత పెట్టడంతో కొద్దిరోజులుగా భవన నిర్మాణ కూలి పనికి వెళ్తున్నాడు. జ్వరం కారణంగా మూడు రోజులు ఇంటి వద్ద ఉన్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన రమణయ్య శుక్రవారం మద్యం మత్తులో సాయిరాంను కర్రతో ఇష్టానుసారంగా కొట్టడమే కాకుండా కత్తిపీట తీసుకొని నరికేస్తానని బెదిరించాడు. అడ్డొచ్చిన చిన్న కుమారుడు అన్వేష్‌నూ కొట్టాడు. వారిద్దరూ తండ్రి బారి నుంచి తప్పించుకొని పక్కింటికి వెళ్లి ప్రాణాలు దక్కించుకున్నారు. అతను ‘డయల్‌ 100’కు సమాచారం ఇవ్వడంతో రమణయ్యను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై విష్ణు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన