కార్వీ.. ఇరవై డొల్ల కంపెనీలు

ప్రధానాంశాలు

Updated : 20/09/2021 06:12 IST

కార్వీ.. ఇరవై డొల్ల కంపెనీలు

సంస్థలోని ఉద్యోగులే డైరెక్టర్లు

బ్యాంకుల తనఖాలో కార్యాలయాలు, ఇళ్లు

ఈనాడు, హైదరాబాద్‌: బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న కార్వీ సంస్థ ఛైర్మన్‌ పార్థసారథి వేర్వేరు సంస్థలకు మళ్లించేందుకు 20 డొల్ల కంపెనీలను ప్రారంభించారని పోలీస్‌ అధికారులు గుర్తించారు. కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ అక్రమాలను హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులు విచారిస్తున్న విషయం విదితమే. ఈ డొల్ల కంపెనీలన్నింటిలోనూ కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు డైరెక్టర్లుగా ఉన్నారు. ఒక కంపెనీ నుంచి మరోదానికి నిధులు మళ్లించారని గుర్తించారు. ఈ కంపెనీల కార్యకలాపాలపై ఆరాతీస్తున్నారు. మరిన్ని అంశాలను తెలుసుకునేందుకు కార్వీ ఛైర్మన్‌ పార్థసారథి, ముఖ్య ఆర్థిక నిర్వహణ అధికారి శైలజలను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

కామ్‌క్రేడ్‌ కంపెనీ.. రూ.7 కోట్ల రుణం

షేర్ల క్రయవిక్రయాల నిర్వహణతో పాటు కార్వీ కామ్‌ట్రేడ్‌ పేరుతో వస్తుసేవల కంపెనీని ప్రారంభించారు. ఇది పసుపు, మిర్చి, కందిపప్పు వంటివి, సుగంధ ద్రవ్యాల ట్రేడింగ్‌ నిర్వహించేది. వ్యాపార విస్తరణకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నుంచి ఆరేళ్ల క్రితం రూ.7 కోట్ల రుణం తీసుకుంది. ఇందుకోసం కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ పూచీకత్తు సమర్పించింది. ఆ రుణాన్ని చెల్లించకుండా జాప్యం చేసింది. రెండేళ్ల క్రితం కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ కార్యకలాపాలపై సెబీ నిషేధం విధించింది. దీంతో రుణం చెల్లింపులు ఆగిపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఈ రుణాన్ని నిరర్ధక ఆస్తిగా పరిగణించింది. అనంతరం విచారణ చేపట్టిన బ్యాంక్‌ అధికారులు ఉద్దేశపూర్వకంగానే తమకు మోసం చేసిందంటూ గుర్తించి ఈ ఏడాది ఏప్రిల్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధ్యులపై దృష్టి

బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నప్పుడు ఉన్న కార్వీ డైరెక్టర్లపై బ్యాంక్‌ అధికారులు ఫిర్యాదు చేశారు. వీరిలో చాలామంది దిల్లీ, చెన్నై, బెంగళూరులలో ఉంటున్నారు. నేరంలో వీరి పాత్ర ఉందా.? లేదా..? అని తెలుసుకునేందుకు త్వరలో ప్రశ్నించనున్నారు. సాక్ష్యాధారాలు లభిస్తే వీరిని అరెస్ట్‌ చేయనున్నారు. మరోవైపు కేసులను తగ్గించుకునేందుకు తనపై ఫిర్యాదు చేసిన వారికి పార్థసారథి డబ్బు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే భీమవరంలో ఉంటున్న డేగల శ్రీనివాస్‌కు రూ.5 లక్షలు, పంజాబ్‌లోని బారువా పోలీస్‌ ఠాణాలో ఫిర్యాదు చేసిన వ్యక్తికి రూ.11 లక్షలు వడ్డీతో చెల్లించారు. వారిద్దరూ తమ ఫిర్యాదులను వెనక్కి తీసుకోనున్నారు. కార్వీ అక్రమాలపై తాజాగా బెంగళూరులోని శేషాద్రిపురం పోలీసులు కేసు నమోదు చేయగా..సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌కు ఆ కేసును బదిలీ చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన