నృత్యం చేస్తూ.. కుప్పకూలాడు

ప్రధానాంశాలు

Updated : 21/09/2021 04:50 IST

నృత్యం చేస్తూ.. కుప్పకూలాడు

కరీంనగర్‌ నేరవార్తలు: నవరాత్రులు గణేశునికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నాడు. శోభాయాత్రతో నిమజ్జనానికి తరలిస్తూ ఉత్సాహంగా నృత్యం చేశాడు. అందరూ చూస్తుండగానే గుండెపోటుతో కుప్పకూలి కన్నుమూసిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి కరీంనగర్‌లో చోటు చేసుకుంది. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మోహన్‌సింగ్‌ చిన్న టీస్టాల్‌ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మోహన్‌సింగ్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు పవన్‌సింగ్‌(22) డిగ్రీ అభ్యసిస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. 8 నెలల కిందనే పవన్‌సింగ్‌ తల్లి తిరత్‌ గుండెపోటుతో మృతి చెందింది. ఆ దుఃఖం నుంచి ఇప్పుడే బయటపడ్డారు. ఆదివారం గణేశ్‌ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్‌ ఉత్సాహం చూపాడు. ఇంట్లో పూజించిన గణేశున్ని స్నేహితులతో కలిసి మానకొండూర్‌ చెరువులో నిమజ్జనం చేశాడు. ఒకటో ఠాణా సమీపంలో ఏర్పాటు చేసి శోభాయాత్రలో పాల్గొన్ని స్నేహితులతో కలిసి సంతోషంగా నృత్యాలు చేశాడు. పవన్‌ నృత్యం చేస్తూ ఒక్కసారిగా కింద పడిపోయాడు. వెంటనే స్నేహితులు అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పవన్‌ గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు. తల్లి తిరత్‌ మృతి చెందిన సంఘటన మరవకముందే.. పవన్‌ గుండెపోటుతో మృతి చెందడంతో ఆ కుంటుంబం దుఃఖంలో మునిగిపోయింది. అప్పటి వరకు తమతో సంతోషంగా గడిపిన మిత్రుడు ఇక లేడన్న వాస్తవాన్ని స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన