ఆరోగ్యశ్రీ చికిత్సకు సాయం పేరిట మోసం

ప్రధానాంశాలు

Published : 23/09/2021 05:12 IST

ఆరోగ్యశ్రీ చికిత్సకు సాయం పేరిట మోసం

ఇద్దరు వసూల్‌రాజాలపై కేసులు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ఆరోగ్యశ్రీలో చికిత్సకు సాయం పేరిట వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరిపై హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నల్గొండ జిల్లా పెద్దఊర మండల ప్రాంతానికి చెందిన కర్నె హనుమంతు, దాసరి ఉమామహేశ్వర్‌రావులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరిద్దరిని అదే గ్రామానికి చెందిన రేషన్‌ డీలర్‌ డి.పెద్ద సైదులు కలిశాడు. తన సోదరుడు చిన్న సైదులు ఆరోగ్యశ్రీ ట్రస్టులో పనిచేస్తాడని, ఉచిత చికిత్సకు సాయం అందిస్తామని నమ్మించాడు. కర్నె హనుమంతు నాంపల్లిలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో, ఉమామహేశ్వర్‌రావు బంజారాహిల్స్‌లోని క్యాన్సర్‌ ఆసుపత్రిలో ఈ నెల 17న చేరి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం సోదరులిద్దరూ హనుమంతును రూ.70 వేలు, ఉమామహేశ్వర్‌రావును రూ.30 వేలు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. వారు రూ.30 వేలు, రూ.15 వేల చొప్పున ఇచ్చారు. డబ్బు కోసం సోదరులిద్దరూ మళ్లీ ఒత్తిడి తేవడంతో చిన్న సైదులుకు ఉమామహేశ్వర్‌రావు రూ.10 వేలను ఫోన్‌పే ద్వారా పంపించారు. ఆ తరువాతా డబ్బులు అడగటంతో ఆరోగ్యశ్రీ ఫిర్యాదుల విభాగాన్ని సంప్రదించారు. దీంతో నల్గొండ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్టు మేనేజర్‌ ప్రమోద్‌ కొండపల్లి ఇచ్చిన సమాచారం మేరకు ఆరోగ్యశ్రీ కేంద్ర ఎగ్జిక్యూటివ్‌ అధికారి బి.వెంకటేశ్వర్‌రావు బుధవారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్ద సైదులు, చిన్న సైదులుపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన