కార్వీ నిధుల తరలింపుపై ఈడీ దర్యాప్తు

ప్రధానాంశాలు

Updated : 23/09/2021 10:53 IST

కార్వీ నిధుల తరలింపుపై ఈడీ దర్యాప్తు

రూ.1,096 కోట్ల రుణాలపై ఆరా!

ఈనాడు, హైదరాబాద్‌: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ (కేఎస్‌బీఎల్‌) సంస్థ నిధుల మళ్లింపు అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) లోతుగా దర్యాప్తు చేస్తోంది. వినియోగదారుల షేర్లను బ్యాంకుల్లో తనఖా పెట్టి కార్వీ సంస్థ రూ.1,096 కోట్ల రుణాలు పొందినట్లు  సెబీ తేల్చడంతో ఈ అంశంపై దృష్టి సారించింది. ఈ నిధుల మళ్లింపునకు కేఎస్‌బీఎల్‌ నిర్వాహకులు పలు డొల్ల కంపెనీలను తెర పైకి తెచ్చినట్లు అనుమానిస్తోంది. ఈక్రమంలో సంస్థ నిర్వాహకుల కనుసన్నల్లోని కంపెనీల ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తోంది. దాదాపు 40 కంపెనీలతో పాటు కొన్ని స్టాక్‌ ట్రేడింగ్‌ సంస్థలపైనా ఈడీ కన్నేసింది. కార్వీ అక్రమాలపై ఇప్పటికే సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌(ఎస్‌ఎఫ్‌ఐవో) దర్యాప్తు చేసిన నేపథ్యంలో అక్కడి నుంచీ సమాచారాన్ని సేకరించే పనిలో ఈడీ ఉన్నట్లు తెలిసింది. ఎస్‌ఎఫ్‌ఐవో ఇప్పటికే కేఎస్‌బీఎల్‌ అధీనంలోని సంస్థల బ్యాంకు ఖాతాల నుంచి రూ.5 లక్షలపైన జరిగిన లావాదేవీల వివరాలు సేకరించింది.

కేఎస్‌బీఎల్‌ నిర్వాహకుల కార్యాలయాలు, ఇళ్లల్లో ఈడీ బృందాలు బుధవారం ముమ్మరంగా సోదాలు చేశాయి. హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లోనూ తనిఖీలు నిర్వహించాయి.చంచల్‌గూడ జైలులో ఉన్న కేఎస్‌బీఎల్‌ సీఎండీ పార్థసారథిని న్యాయస్థానం అనుమతితో ఈ నెల 5న  విచారించిన అధికారులు.. ఆయన నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సోదాలు చేశారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన