ముగ్గురు కేటుగాళ్లు... 4 వేల మోసాలు

ప్రధానాంశాలు

Updated : 23/09/2021 09:28 IST

ముగ్గురు కేటుగాళ్లు... 4 వేల మోసాలు

నకిలీ పత్రాలు సృష్టించి 5 వేల సిమ్‌కార్డుల జారీ
సైబర్‌ నేరగాళ్లతో జత కట్టి రూ.కోట్లలో జనానికి టోకరా!
ఈనాడు - హైదరాబాద్‌

జిరాక్స్‌ సెంటర్‌ నిర్వాహకుడు... ఓ సిమ్‌కార్డుల వ్యాపారి.. ఫొటోలు సేకరించే వ్యక్తి- ఈ ముగ్గురూ కలిసి సృష్టించిన నకిలీ ఆధార్‌ కార్డులు, పాన్‌కార్డులు... వాటితో ప్రారంభించిన తప్పుడు బ్యాంక్‌ ఖాతాలతో సైబర్‌ మోసగాళ్లు జనం సొమ్మును కోట్లలో కొల్లగొట్టారు. నకిలీ పత్రాలు సృష్టించే ఓ ముఠా గుట్టు రట్టవడంతో తాజాగా ఈ విషయం బయటకొచ్చింది. హరియాణాకు చెందిన ముగ్గురు సభ్యుల ఈ ముఠా ఐదువేల సిమ్‌కార్డులు ఉపయోగించి సైబర్‌మోసగాళ్లతో కలిసి నాలుగువేల నేరాలకు పాల్పడింది. బాధితులు వేలల్లో ఉండగా.. దోపిడీ రూ.కోట్లలో ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి ‘‘అసలు ఎంత కొల్లగొట్టారో లెక్క తేలడానికే రోజులు పడుతున్న ఈ సైబర్‌ నేరం దేశంలోనే అతిపెద్దదిగా చెప్పవచ్చు’’ అని ఓ అధికారి అన్నారు.

ఎలా దొరికారంటే..

సైబర్‌ నేరాలను అదుపు చేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రత్యేకంగా సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసింది. సైబర్‌ నేరాల బారినపడ్డవారు 155260 నంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలి. వాటిని జాతీయస్థాయిలో విశ్లేషిస్తారు. బెంగళూరుకు చెందిన అనేక మందికి హరియాణా నుంచి ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్లు కోఆర్డినేషన్‌ సెంటర్‌ అధికారులు గుర్తించారు. దర్యాప్తు జరిపిన బెంగళూరు పోలీసులు ఆ సిమ్‌కార్డులను ముజాహిద్‌ ముఠా సమకూర్చుతున్నట్లు గుర్తించారు. గర్‌వాలీ, పున్‌హనా ప్రాంతాలకు చెందిన ముజాహిద్‌, ఇక్బాల్‌, ఆసిఫ్‌లను గత వారం హరియాణా వెళ్లి అరెస్టు చేశారు.

ఒక్క హైదరాబాద్‌లోనే 150కి పైగా నేరాలు

ముజాహిద్‌ ముఠా సమకూర్చిన సిమ్‌కార్డుల ద్వారా దేశవ్యాప్తంగా 3,951 నేరాలు జరిగినట్లు, రెండు మూడు సంవత్సరాల వ్యవధిలో ఈ ముఠా ఐదువేల సిమ్‌కార్డులు సరఫరా చేసినట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. ఒక్క హైదరాబాద్‌లోనే 150కి పైగా నేరాలు జరిగినట్లు సమాచారం. రాష్ట్రం మొత్తంమీద 400 వరకూ ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం బెంగళూరు పోలీసుల అదుపులో ఉన్న ఈ ముగ్గురు సభ్యుల ముఠాను పీటీ వారెంటుపై వచ్చేవారం హైదరాబాద్‌ పోలీసులు ఇక్కడకు తీసుకొస్తున్నారు.

నకిలీ కార్డుల సృష్టి ఇలా...

ముజాహిద్‌కు హరియాణాలో ఓ ప్రముఖ సంస్థకు చెందిన సిమ్‌కార్డులు అమ్మే వ్యాపారం ఉంది. ఆసిఫ్‌ రకరకాల వ్యక్తుల ఫొటోలు సేకరించేవాడు. ఇక్బాల్‌కు జిరాక్స్‌, కంప్యూటర్‌ సెంటర్‌ ఉంది. ఇక్బాల్‌.. జిరాక్స్‌ కోసం వచ్చే వారికి చెందిన ఆధార్‌కార్డులు, ఇతర పత్రాల సమాచారం సేకరించి పెట్టుకునేవాడు. ఆసిఫ్‌ ఇచ్చిన ఫొటోలకు ఈ వివరాలు జతచేసి నకిలీ ఆధార్‌కార్డులు తయారు చేసేవాడు. ఈ కార్డుల ద్వారా ముజాహిద్‌ సిమ్‌కార్డులు అమ్మినట్లు చూపించేవాడు. అనంతరం ఈ సిమ్‌కార్డులన్నీ వారు సైబర్‌ నేరగాళ్లకు సరఫరా చేసేవారు.

ఈ-వ్యాలెట్లలో లోపాలను ఉపయోగించుకొని కూడా...

వివిధ ఈ-వ్యాలెట్లలో ఉన్న చిన్నచిన్న లోపాలను ఉపయోగించుకొని కూడా మోసాలు చేశారు. వీటిలో ఉన్న పేర్లకు సంబంధించి పాన్‌కార్డు నంబర్లు సేకరించేవారు. ఇలా పాన్‌కార్డు నంబరుకుతోడు ఏదోఒక ఫొటో పెట్టి నకిలీ ఆధార్‌కార్డు సృష్టించి బ్యాంకు ఖాతా తెరిచేవారు. ఇటువంటి బోగస్‌ పత్రాల ద్వారా తెరిచిన ఖాతాలకు అనుబంధంగా ఈ వ్యాలెట్లు సిద్ధం చేసి వాటిని కూడా సైబర్‌ నేరగాళ్లకు ఇచ్చేవారు. వారూ, వీరూ కలిసి బోగస్‌ సిమ్‌కార్డులతో మోసం చేసి కొల్లగొట్టిన డబ్బును ఇలాంటి నకిలీ వ్యాలెట్లలోకి మళ్లించేవారు. దేశవ్యాప్తంగా వేల బాధితుల నుంచి రూ.కోట్లు కొల్లగొట్టినట్లు సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌ అధికారులు నిర్ధరించారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన