గూడు దక్కక ముందే.. గుండె ఆగింది

ప్రధానాంశాలు

Updated : 24/09/2021 05:59 IST

గూడు దక్కక ముందే.. గుండె ఆగింది

 రోడ్డు విస్తరణలో ఇల్లు స్వాధీనం  

ఆరేళ్లుగా తిప్పించుకున్న అధికారులు

 కల సాకారమయ్యేవేళ ఆకస్మికంగా మృతి

గజ్వేల్‌, న్యూస్‌టుడే: సొంత ఇల్లంటే ప్రాణం ఎవరికైనా.. ఏ కారణం వల్లయినా దానిని కోల్పోతే ఆ బాధ వర్ణనాతీతం. మళ్లీ ఓ గూడు సమకూర్చుకునేందుకు ఎంత శ్రమించాలో.. ఎన్ని కష్టాలు పడాలో అనుభవించినవారికే తెలుస్తుంది. రోడ్డు విస్తరణలో ఇంటిని కోల్పోయి.. ఐదారేళ్లుగా అద్దె ఇళ్లలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న నిరుపేద.. తీరా అధికారులు సర్వేకు వచ్చేసరికి గుండెపోటుతో చనిపోయిన విషాదకర ఘటన ఇది. స్థానికుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌కు చెందిన వడ్డేపల్లి వెంకటేశం(51)కు భార్య నర్మద, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. 2015లో గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ రోడ్డు విస్తరణలో అతడి ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. పరిహారం ఇస్తామన్న అధికారులు పట్టించుకోలేదు. పలుమార్లు తిరిగాక రెండు పడక గదుల ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. వాటి పంపిణీకి లబ్ధిదారులను గుర్తించడానికి ఇటీవలే ఇంటింటి సర్వే ప్రారంభించారు. గురువారం వెంకటేశం ఉంటున్న అద్దె ఇంటికి రాగా వారికి తన కష్టాలన్నీ వివరించాడు. ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నానని, కుటుంబ సభ్యులతో పాటు తానూ అనారోగ్యంతో బాధపడుతున్నానని అధికారుల ముందు ఏకరువు పెట్టాడు. వాటి పత్రాలు తెచ్చేందుకు మొదటి అంతస్తు నుంచి కిందకు దిగాడు. తిరిగి రాకపోవటంతో కుటుంబసభ్యులు కిందకు వచ్చి చూడగా అచేతనంగా పడి ఉన్నాడు. ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సొంతింటి కల నెరవేరకుండానే మృతి చెందిన వెంకటేశాన్ని చూసి స్థానికులు కంటతడిపెట్టారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన