ఇద్దరు బాలికలపై కీచకపర్వం

ప్రధానాంశాలు

Published : 24/09/2021 06:01 IST

ఇద్దరు బాలికలపై కీచకపర్వం

 మహారాష్ట్రలో నెలల తరబడి.. 33 మంది రాక్షసత్వం

 ఛత్తీస్‌గఢ్‌లో సామూహిక అత్యాచారం

ఠాణె/బలరామ్‌పుర్‌: మనుషుల రూపంలో తిరుగాడుతూ.. రాక్షసుల్లా ప్రవర్తిస్తున్న కామాంధుల అకృత్యాలు ఆగడం లేదు. మహారాష్ట్రలో ఓ బాలిక (15)పై 33 మంది నెలల తరబడి పలుమార్లు అత్యాచారానికి తెగబడిన ఘోరం వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లో మరో ఘటనలో ఓ బాలిక (14)పై ఐదుగురు దుర్మార్గులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. రెండు చోట్ల దారుణాలకు పాల్పడినవారిలో ఇద్దరు చొప్పున మైనర్‌ బాలురు కూడా ఉన్నారు.


8 నెలలుగా బెదిరిస్తూ అఘాయిత్యం

మహారాష్ట్రలోని ఠాణే జిల్లా మన్‌పాడ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై జనవరి 29 నుంచి ఈనెల 22 వరకు 33 మంది వ్యక్తులు వేర్వేరు చోట్ల అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో ఆ బాలికపై ఆమె ప్రియుడు అత్యాచారం చేశాడు. ఈ అకృత్యాన్ని వీడియో తీసి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. అనంతరం అతని స్నేహితులు, పరిచయస్తులు అతనికి తోడయ్యారు. ఆమెను నెలల తరబడి చిత్రహింసలు పెట్టి అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలు ఈ ఘోరాన్ని తన బంధువొకరికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. నిందితుల్లో 24 మందిని అరెస్టు చేశారు. పోక్సో చట్టంతో పాటు, భారత శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసు దర్యాప్తునకు ఏసీపీ నేతృత్వంలో ‘సిట్‌’ను ఏర్పాటు చేశారు.


ఒంటరి బాలికపై కీచకత్వం..

ఛత్తీస్‌గఢ్‌ బలరామ్‌పుర్‌ జిల్లాలో ఈనెల 19న ఓ బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఒంటరిగా ఉన్న బాలికను చూసి ఓ వ్యక్తి బలవంతంగా పొలాల్లోకి లాక్కెళ్లాడు. అక్కడ అప్పటికే మరో నలుగురు ఉండగా వారందరూ ఆమెపై అకృత్యానికి పాల్పడ్డారు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా.. అక్కడే వదిలేసి వారంతా పరారయ్యారు. ఆ తర్వాత విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లున్నట్లు పోలీసులు తెలిపారు.


యూపీలో మరో ఘోరం.. యువతిపై హత్యాచారం

- పదో అంతస్తు నుంచి తోసివేత

కాన్పుర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో 19 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు, ఆ తర్వాత ఆమెను భవనం పదో అంతస్తు నుంచి తోసి చంపేశాడని పోలీసులు గురువారం తెలిపారు. స్థానికంగా పాడి పరిశ్రమ నిర్వహిస్తున్న ప్రతీక్‌ వైష్‌ (40) ఈ ఘోరానికి పాల్పడినట్లు చెప్పారు. తొలుత పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన నిందితుడు, అనంతరం నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు. తన దగ్గర కార్యదర్శిగా పనిచేస్తున్న మహిళను కార్యాలయానికి సంబంధించిన పని ఉందంటూ నిందితుడు కల్యాణ్‌పుర్‌లోని తన నివాసానికి (అపార్ట్‌మెంట్‌కు) మంగళవారం తీసుకెళ్లాడు. అనంతరం తనతో శారీరక సంబంధానికి అంగీకరించాల్సిందిగా కోరుతూ డబ్బులు ఆశ చూపాడు. ఆమె నిరాకరించడంతో అత్యాచారం చేశాడు. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తాననడంతో పదో అంతస్తులోని బాల్కనీ నుంచి బలంగా నెట్టాడు. అక్కడి నుంచి పడిపోయిన బాధితురాలు మరణించినట్లు డీసీపీ మూర్తి గురువారం తెలిపారు. నిందితుడిని బుధవారం అరెస్టు చేసినట్లు చెప్పారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన