Crime News: ఊపిరి పోసిన వారే ఉసురు తీశారు

ప్రధానాంశాలు

Updated : 25/09/2021 07:35 IST

Crime News: ఊపిరి పోసిన వారే ఉసురు తీశారు

మద్యం మత్తులో భార్యాభర్తల ఘర్షణ
పెనుగులాటలో ప్రాణాలు కోల్పోయిన పసికందు
గతంలో పెద్ద కుమారుడిని బయటకు విసిరేసిన వైనం

మద్యం మత్తులో జరుగుతున్న దారుణాల్లో ఇదొకటి. తాగుడుకు బానిసలైన దంపతులు గొడవ పడితే, వారి పెనుగులాటలో 22 రోజుల పసికందు బలైపోయిన సంఘటన ఇది. గతంలో వారి పెద్దకుమారుడు అయిదు నెలల వయసున్నప్పుడు... తాగిన మైకంలో ఆ పసివాడిని బయటకు విసిరేసిన దంపతులు ఇప్పుడు రోజుల వయసున్న రెండో కుమారుడి ఉసురు తీసేశారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సైదాబాద్‌ డివిజన్‌ పూసలబస్తీ పరిధి క్రాంతినగర్‌బస్తీకి చెందిన పొదిల రాజేష్‌ అలియాస్‌ రాజు (36), జాహ్నవి (25) దంపతులు. రాజేష్‌ వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇప్పటికే ఒక కుమారుడు ఉండగా, 22 రోజుల కిందట జాహ్నవి రెండో మగబిడ్డకు జన్మనిచ్చింది. శుక్రవారం సాయంత్రం దంపతులిద్దరూ మద్యం తాగి, మత్తులో గొడవకు దిగారు. ఆ సమయంలో శిశువు తల్లి ఒడిలో ఉన్నాడు. రాజు భార్యపై దాడి చేయగా, ఆమె శిశువును అడ్డుగా పెట్టింది. ఇద్దరి పెనుగులాటలో చిన్నారి ఊపిరి ఆగిపోయింది. స్థానికుల సహకారంతో వెంటనే నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించినా ప్రాణం దక్కలేదు. రెండేళ్ల కిందట అయిదు నెలల వయసున్న తమ పెద్ద కుమారుడిని ఈ దంపతులు మద్యం మత్తులో బయటికి విసిరేశారు. అప్పట్లో పోలీసులు జోక్యం చేసుకుని, ఆ బాలుడిని యూసుఫ్‌గూడలోని శిశువిహార్‌కు తరలించారు. ఆ బాలుడు ఇప్పటికీ అక్కడే పెరుగుతున్నాడు. ఇప్పుడు రెండో కుమారుడు భార్యాభర్తల మత్తు ఘర్షణకు బలయ్యాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్‌స్పెక్టర్‌ కె. సుబ్బిరామరెడ్డి సంఘటన స్థలానికి వచ్చి, వివరాలు సేకరించారు. దంపతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

- న్యూస్‌టుడే, సైదాబాద్‌



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన