గుద్దింది ఒకరు.. లొంగిపోయింది మరొకరు

ప్రధానాంశాలు

Updated : 26/09/2021 05:16 IST

గుద్దింది ఒకరు.. లొంగిపోయింది మరొకరు


ఆందోళన చేస్తున్న మృతురాలి కుటుంబసభ్యులు

దుండిగల్‌, న్యూస్‌టుడే: డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదు.. పైగా ట్యాంకర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఫూటుగా మద్యం తాగి ట్యాంకర్‌ నడిపి యువతి ప్రాణాన్ని బలితీసుకున్నాడు. నిందితుడిని తప్పించేందుకు తెరవెనక చేసిన ప్రయత్నాలు సినిమాను తలపించాయి. ప్రమాదం జరిగిన వెంటనే అతను పరారవడం.. అతనికి బదులు మరొకరు లొంగిపోవడం చకచక జరిగిపోయాయి. దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గ్లాండ్‌ ఫార్మా పరిశ్రమలో కూలీగా పని చేస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన సులోచన(25) శుక్రవారం విధులు ముగించుకుని పరిశ్రమ గేటు దాటిన వెంటనే ట్యాంకర్‌ ఢీ కొట్టడంతో మృతిచెందిన విషయం విదితమే.

అసలు డ్రామా మొదలైంది ఇలా.. సీఐ రమణారెడ్డి కథనం ప్రకారం.. పరిశ్రమ నుంచి బయటకు వచ్చిన నిమిషంలోనే వెనక నుంచి ట్యాంకర్‌ ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆమె మృతిచెందింది. మొదట గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టిందని ప్రచారం చేశారు. పోలీసుల విచారణలో సీసీ కెమెరాలను పరిశీలించగా పరిశ్రమకు నీరు సరఫరా చేసే ట్యాంకర్‌ ఢీకొట్టినట్లు గుర్తించారు. అనంతరం ట్యాంకర్‌ డ్రైవర్‌ శ్రీకాంత్‌ వాహనాన్ని రోడ్డుపక్కన ఆపి పరారయ్యాడు. అతనికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోవడం, మద్యం తాగి ఉండటంతో డ్రామా ప్రారంభించారు. పరిశ్రమకు నీటి సరఫరా చేసేందుకు యాజమాన్యం స్థానిక నివాసి నరేందర్‌రెడ్డితో ఐదేళ్ల క్రితం ఒప్పందం చేసుకుంది. ట్యాంకర్‌ల నిర్వహణ బాధ్యతలు సంతోష్‌ చూస్తున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే శ్రీకాంత్‌ను తప్పించేందుకు ఇద్దరూ కలిసి తెరవెనుక ప్రయత్నాలు చేశారు. మరో ట్యాంకర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న నర్సింహులు పోలీసులకు లొంగిపోయేలా చేసినట్లు తెలిసింది. పోలీసుల విచారణలో నర్సింహులు తడబడడంతో అసలు విషయం బయట పడింది. అసలు నిందితుడు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. శ్వాస పరీక్ష చేయగా 117 పాయింట్లు రావడంతో అవాక్కయ్యారు. అతనికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ సైతం లేదని తేలింది. దీంతో ఐపీసీ 304 పార్ట్‌ 2, 201, 203, 205, 109 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. నర్సింహులుతో పాటు సంతోష్‌పైనా కేసు నమోదు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు.

తమకు న్యాయం చేయాలంటూ సులోచన కుటుంబసభ్యులు శనివారం పరిశ్రమ ఎదుట ఆందోళనకు దిగారు. పరిశ్రమతో పాటు గుత్తేదారు తగిన నష్టపరిహారం ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన