సెల్ఫీ సరదాతో ఇద్దరి గల్లంతు

ప్రధానాంశాలు

Published : 27/09/2021 04:25 IST

సెల్ఫీ సరదాతో ఇద్దరి గల్లంతు

మోయతుమ్మెద వాగులో లభించని మామా,అల్లుడి ఆచూకీ

కోహెడ గ్రామీణం, న్యూస్‌టుడే : సెల్ఫీ సరదా ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. ఫొటోలు తీసుకునేందుకు వాగులోకి దిగిన మామా,అల్లుడు మ్యాదరి రాజు (27), చెంచల రిషి (11) ప్రమాదవశాత్తు నీటమునిగి గల్లంతయ్యారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. కోహెడ ఎస్‌ఐ రాజ్‌కుమార్‌, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. తంగళ్లపల్లికి చెందిన మ్యాదరి రాజు, చెంచల రిషి మామాఅల్లుళ్లు. రాజు బెజ్జంకిలో ద్విచక్ర వాహనాల మెకానిక్‌గా పని చేస్తుండగా రిషి ఓ ప్రైవేటు పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో వారి కుటుంబ సభ్యులంతా గ్రామ సమీపంలోని మోయతుమ్మెద వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంను చూసేందుకు వెళ్లారు. సాయంత్రం రాజు, అతని మేనల్లుడు రిషి వాగు అంచున నిలుచుని ఫొటోలు దిగారు. తర్వాత కిందకు దిగి సెల్ఫీలు తీసుకుంటున్న సమయంలో రిషి కాలు జారి నీటిలో పడ్డాడు. పక్కనే లోతు ఎక్కువగా ఉన్న గుంతలోకి జారాడు. అతన్ని కాపాడేందుకు ప్రయత్నించి రాజు గుంతలోకి దిగగా రిషి అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. దీంతో ఈత వచ్చిన రాజు కూడా ఏమీ చేయలేక పోయాడు. ఇద్దరూ నీటిలో మునిగారు. వారి కేకలు విన్న మిగతా కుటుంబ సభ్యులు, స్థానికులు వచ్చే సరికే కన్పించకుండా పోయారు. విషయాన్ని పోలీసులకు తెలుపగా వెంటనే కోహెడ ఎస్‌ఐ రాజ్‌కుమార్‌, సర్పంచి పాము నాగేశ్వరి అక్కడకు చేరుకుని ఈతగాళ్ల సహాయంతో గాలించినా రాత్రి 9 గంటల వరకు ఆచూకీ లభించలేదు. ఛార్జింగ్‌ లైట్ల సాయంతో వెతికినా దొరకలేదు. వాగులో బండరాళ్ల కింద చిక్కుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సోమవారం మరోసారి గాలించనున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన