సంతోషం.. క్షణాల్లో ఆవిరి

ప్రధానాంశాలు

Updated : 28/09/2021 06:05 IST

సంతోషం.. క్షణాల్లో ఆవిరి

కారు బోల్తా పడి యువతి మృతి: ఆరుగురికి గాయాలు

సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న స్థానికులు..

పీలేరు గ్రామీణ: ఆ ఊరిలో గ్రామ దేవత దేవర్లకు బంధువులు వచ్చారు.. సాయంత్రం వరకు సంతోషంగా గడిపారు.. సరదాగా నీటి ప్రాజెక్టును చూద్దామని యువత కారులో బయలుదేరి వెళుతోంది.. కొద్ది క్షణాల్లో అక్కడికి చేరుకునే సమయంలో కారు అదుపుతప్పి బోల్తా పడింది.. ఈ సంఘటనలో ఓ విద్యార్థిని మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా, నలుగురికి స్వల్పంగా గాయపడ్డారు. ఎస్సై తిప్పేస్వామి కథనం ప్రకారం... పీలేరు మండలం దొడ్డిపల్లె పంచాయతీ బెస్తపల్లెకు చెందిన ఆర్టీసీ కండక్టర్‌ శ్రీనివాసులు పెద్ద కుమారుడు విజయ్‌ (20) డిగ్రీ వరకు చదివి వ్యవసాయ పనులను చూసుకుంటున్నాడు. తన సొంత కారులో అదే గ్రామానికి చెందిన పలువురు బంధువులు, స్నేహితులు ఆదివారం సాయంత్రం సమీపంలోని గార్గేయ ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరారు. ప్రాజెక్ట్‌ సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. పశువుల కాపరులు కారు అద్దాలు పగులగొట్టి క్షతగాత్రులను బయటకు తీశారు. విజయ్‌తో పాటు సాయిప్రకాశ్‌ (17), దీప (17) తీవ్రంగా గాయపడటంతో పీలేరులో ప్రాథమిక చికిత్స చేసి.. తిరుపతికి తరలించారు. నలుగురు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీప చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది.

పండుగకు వచ్ఛి.. ఇదే గ్రామానికి చెందిన ప్రసాద్‌, సుభాషిణి దంపతులకు చందు, దీప పిల్లలు. 15 ఏళ్ల కిందట వీరు జీవనోపాధి నిమిత్తం బెంగళూరు వెళ్లారు. దీప బెంగళూరులోనే ఇంటర్‌ చదువుతోంది. స్వగ్రామంలో జరిగే దేవర్లకు వచ్చి బంధువులు, స్నేహితులతో సరదాగా గడిపారు. ఈ క్రమంలో ప్రాజెక్టును చూడడానికి వెళ్లిన దీపను మృత్యువు కబళించడంతో ఈ కుటుంబానికి తీవ్ర గుండెకోత మిగిలింది. రాకరాకా వచ్చి కుమార్తెను పోగొట్టుకున్నామని తల్లిదండ్రులు విలపిస్తున్నారు.

దీప (పాతచిత్రం)Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన