రూ. 10 కోట్లు కొల్లగొడితే... రూ. 2.54 కోట్ల కమీషన్‌

ప్రధానాంశాలు

Published : 15/10/2021 04:04 IST

రూ. 10 కోట్లు కొల్లగొడితే... రూ. 2.54 కోట్ల కమీషన్‌

డిపాజిట్ల గోల్‌మాల్‌ వ్యవహారంలో సూత్రధారి సాంబశివరావు అరెస్టు

చెల్లెలి వరసైన బ్యాంకు మేనేజర్‌ సాయంతో గుట్టుగా వ్యవహారం

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌ వ్యవహారంలో కీలక సూత్రధారి, విశాఖపట్నంలో ఉంటున్న సాంబశివరావును సీసీఎస్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కెనరా బ్యాంకు చందానగర్‌ శాఖ మాజీ మేనేజర్‌ సాధనకు నిందితుడు బంధువని, రూ.10 కోట్లు కాజేసే వ్యవహారంలో ఆమెకు సహకరించింది కూడా ఈయనేనని సీసీఎస్‌ ఏసీపీ మనోజ్‌ కుమార్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..

బతుకుతెరువు కోసం వైజాగ్‌కు.. ఆదాయం తగ్గి అక్రమాలకు

‘‘గుంటూరుకు చెందిన సాంబశివరావు తొలుత ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. జీతం చాలకపోవడం, ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరికతో తన మకాంను కొన్నేళ్ల క్రితం వైజాగ్‌కు మార్చాడు. ఎస్‌వీఎల్‌ యాడ్స్‌ పేరుతో ప్రకటనల కంపెనీని ప్రారంభించాడు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, జాతీయ, కార్పొరేటు బ్యాంకుల ప్రకటనలను సేకరించేవాడు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌ వ్యవహారాన్ని ముందుండి నడిపిన సాయికుమార్‌ ముఠాలో సభ్యుడైన వెంకటరమణకు..మూడేళ్ల క్రితం వైజాగ్‌లో సాంబశివరావు పరిచయమయ్యాడు. వైజాగ్‌కు వెళ్లినప్పుడల్లా కలుస్తుండడంతో ఇద్దరి మధ్య స్నేహం బలపడింది.

చెల్లెల్ని ఇరికించి.. తానూ ఇరుక్కుని

కరోనా ప్రభావంతో ప్రకటనల నుంచి వస్తున్న కమీషన్‌ తగ్గిపోవడంతో నిందితుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ సమయం(గతేడాది అక్టోబరు)లో వైజాగ్‌కు వెళ్లిన వెంకటరమణ.. తెలుగు అకాడమీకి చెందిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల సొమ్ము కాజేసే ఆలోచనను అతనితో పంచుకున్నాడు. తెలిసిన బ్యాంకు మేనేజరు ఉంటే తమ పని సులువు అవుతుందని, కమీషన్‌ కూడా భారీగానే ఇస్తామనే ప్రతిపాదన తెచ్చాడు. ఆర్థిక ఇబ్బందులో ఉన్న సాంబశివరావు దానికి అంగీకరించాడు. తన దగ్గరి బంధువు, చెల్లెలు వరసయ్యే సాధన కెనరా బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తోందని, ఆమె సహాయం తీసుకుందామని ప్రతిపాదించాడు. అందులో భాగంగా ఈ ఏడాది జనవరిలో సాయికుమార్‌ ముఠా సభ్యులు తమ పథకాన్ని సాధనకు వివరించారు. ఆమె అంగీకరించడంతో కెనరా బ్యాంకులో తెలుగు అకాడమీకి చెందిన రూ.10 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో జమచేశారు. తర్వాత నకిలీ పత్రాలతో ఆ సొమ్ము తీసుకున్నారు. సహకరించినందుకు సాధన రూ.1.99 కోట్లు, సాంబశివరావు రూ.55 లక్షలు కమీషన్‌గా పొందారు’ ఏసీపీ మనోజ్‌కుమార్‌ వివరించారు. ఈ వ్యవహారం బయటపడగానే నిందితుడు అజ్ఞాతంలోకి వెళ్లాడని, గుంటూరులో ఉన్నట్టు తెలుసుకుని గురువారం అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. హైదరాబాద్‌కు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచి, చంచల్‌గూడ జైలుకు తరలించినట్టు చెప్పారు. తాజా అరెస్టుతో ఈ కుంభకోణంలో నిందితుల సంఖ్య 15కు పెరిగిందని తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన