చెరువులో పడి నలుగురు చిన్నారుల మృతి

ప్రధానాంశాలు

Published : 15/10/2021 04:04 IST

చెరువులో పడి నలుగురు చిన్నారుల మృతి

కైకలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: అమ్మమ్మ ఇంట్లో దసరా చేసుకోవాలని.. చిన్నమ్మ, పెద్దమ్మ పిల్లలతో ఆడుకోవాలని వచ్చిన ఆ చిన్నారులను చెరువు పొట్టనపెట్టుకుంది. పండగ వేళ పిల్లల సందడితో కళకళలాడాల్సిన కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది. అమ్మమ్మ ఇంటికి వచ్చిన గంట వ్యవధిలోనే నలుగురు పిల్లలు మృతి చెందిన ఈ ఘటన కృష్ణా జిల్లా కైకలూరు మండలం వరహాపట్నం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వరహాపట్నం గ్రామానికి చెందిన కట్టా వెంకటేశ్వరమ్మకు ఇద్దరు కుమార్తెలు. ఒకరిది సీతనపల్లి, మరొకరిది అల్లూరు. వీరిలో మొదటి కుమార్తె పిల్లలు వీరగాని నవ్యశ్రీ (10), కావ్యశ్రీ (11), అయ్యప్ప, రెండో కుమార్తె సంతానం లుక్కా వీరాంజనేయులు (6), నిఖిత (10) పండగకని గురువారం అమ్మమ్మ ఇంటికి వచ్చారు. వెంకటేశ్వరమ్మ గ్రామ మంచినీటి చెరువు గట్టుపై పచ్చగడ్డి కోసేందుకు వెళ్లగా పిల్లలు ఆమె వెంట అనుసరించారు. వెంకటేశ్వరమ్మ పనిలో ఉండగా.. చిన్నారులు గట్టుపై ఆడుకుంటూ అయ్యప్ప తప్ప మిగిలిన నలుగురు చెరువులోకి దిగి మునిగిపోయారు. విషయం తెలుసుకున్న వెంకటేశ్వరమ్మ కేకలు వేయడంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని బయటికి తీశారు. అప్పటికే ఓ బాలుడు, ఇద్దరు బాలికలు మృతిచెందారు. కొన ఊపిరితో ఉన్న కావ్యశ్రీని కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలొదిలింది. ఆసుపత్రి వద్ద కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. కైకలూరు ప్రభుత్వాసుపత్రి ప్రాంగణం వరహాపట్నం, సీతనపల్లి, అల్లూరు గ్రామస్థులతో నిండిపోయింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన