కాలు జారి ఒకరు.. కాపాడే క్రమంలో ఇంకొకరు!

ప్రధానాంశాలు

Updated : 18/10/2021 14:54 IST

కాలు జారి ఒకరు.. కాపాడే క్రమంలో ఇంకొకరు!

డిండి జలాశయం స్పిల్‌వే వద్ద ఇద్దరు యువకుల దుర్మరణం

సెల్ఫీ సరదాతో మృత్యు ఒడికి

డిండి, న్యూస్‌టుడే: జలజలపారే నీళ్ల మధ్య సరదాగా సెల్ఫీ దిగాలనుకున్న ఇద్దరు యువకులు విషాదాంతమయ్యారు. పొరపాటున ఒకరు కాలుజారి కిందపడిపోగా, ఈత వచ్చిన స్నేహితుడు అతన్ని కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. నల్గొండ జిల్లాలోని డిండి జలాశయం వద్ద ఆదివారం జరిగిన ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం అలముకుంది. ఎస్సై పోచయ్య కథనం ప్రకారం...

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌కు చెందిన మహ్మద్‌సాగర్‌ (23) ప్లంబర్‌. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం చిన్న హైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్‌(23) ప్రైవేటు ఉద్యోగి. వీరిరువురూ వేర్వేరు ప్రాంతాల్లోని మరో నలుగురు స్నేహితులతో కలిసి ఈ నెల 15న విహారయాత్రగా హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్లారు. స్వామి దర్శనానంతరం ఆదివారం శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో డిండి జలాశయం వద్ద ఆగారు. ముందుగా అలుగు పారుతున్న దృశ్యాలను సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. అనంతరం మహ్మద్‌ సాగర్‌, ప్రవీణ్‌ సెల్ఫీ దిగేందుకు స్పిల్‌వే వద్దకు వెళ్లారు. స్వీయచిత్రాలు తీసుకుంటున్న క్రమంలో గోడకున్న పాచి కారణంగా సాగర్‌ కాలుజారి నీళ్లలో పడి కొట్టుకుపోయాడు. ఈత వచ్చనే ధైర్యం, స్నేహితుడిని ఎలాగైనా కాపాడాలనే తాపత్రయంతో ప్రవీణ్‌ నీళ్లలో దూకాడు. కాపాడే క్రమంలో తానూ నీట మునిగాడు. ఒడ్డునే ఉన్న స్నేహితులు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న జాలర్లు వలల సాయంతో ఇద్దర్నీ బయటకు తీశారు. డిండిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కళ్లెదుటే స్నేహితులు మృత్యువాత పడటంతో సన్నిహితులు భోరున విలపించారు. మహ్మద్‌ సాగర్‌కు ఏడాదిన్నర క్రితమే వివాహమైందని, అతని మృతితో కుటుంబం వీధిన పడినట్టయిందని కన్నీటి పర్యంతమయ్యారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన