వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి దుర్మరణం

ప్రధానాంశాలు

Published : 20/10/2021 05:20 IST

వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి దుర్మరణం

కర్నూలు జిల్లాలో ముగ్గురు,  నెల్లూరు జిల్లాలో మరో ముగ్గురు

ఆళ్లగడ్డ, కావలి గ్రామీణం, న్యూస్‌టుడే: కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్న కార్లు ప్రమాదానికి గురవడంతో ఆళ్లగడ్డ వద్ద ముగ్గురు, ముసునూరు వద్ద ముగ్గురు మృతి చెందారు.

* భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్న కర్నూలు జిల్లా శిరివెళ్లకు చెందిన కలామ్‌, అఫ్జల్‌ ద్విచక్ర వాహనంపై ఆళ్లగడ్డ నుంచి ఎన్‌హెచ్‌ మీదుగా యర్రగుంట్లకు బయలుదేరారు. ఈ సమయంలో వారి గ్రామానికి చెందిన జాబీర్‌, సులేమాన్‌ కనిపించడంతో ఆళ్లగడ్డ సమీపంలో రోడ్డుకు ఎడమ వైపు వాహనం ఆపి మాట్లాడుతున్నారు. సరిగ్గా అప్పుడే రోడ్డుకు అవతలి వైపు నుంచి వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ మీదుగా వచ్చి నలుగురిని ఢీకొంది. ప్రమాదంలో కలామ్‌(30), అఫ్జల్‌(18), జాబిర్‌(18) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సులేమాన్‌ తీవ్రంగా గాయపడ్డారు. కారు నడుపుతున్న చాగలమర్రి మండలం కొత్తపల్లెకు చెందిన బాలీశ్వరరెడ్డి గాయపడ్డారు. క్షతగాత్రులను నంద్యాలకు తరలించారు.

* శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణ సమీపంలోని ముసునూరు జాతీయ రహదారిపై ఓ కారు ఎదురుగా వెళ్తున్న కంటెయినర్‌ కిందకు దూసుకుపోయింది. చిత్తూరు జిల్లా తిరుపతిలోని పద్మావతిపురం కేఆర్‌నగర్‌కు చెందిన కైలసాని భార్గవీలత, తలమాల రాజేశ్వరమ్మ, నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన ఇరుసు వెంకటరమణయ్యతోపాటు తలమాల రవి, సువినాష్‌సాయి ప్రకాశం జిల్లా ఉలవపాడులో బంధువుల అమ్మాయి నలుగు కార్యక్రమానికి హాజరయ్యారు. సాయంత్రం కారులో తిరిగి వెళుతుండగా జాతీయ రహదారిపై ముందు వెళుతున్న కంటెయినర్‌ లారీని వీరి వాహనం ఢీకొట్టింది. కైలసాని భార్గవీలత(45), తలమాల రాజేశ్వరమ్మ(65), ఇరుసు వెంకటరమణయ్య(66) అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కారులో చిక్కుకున్న మృతదేహాలను క్రేన్‌ సాయంతో బయటకు తీయించారు. క్షతగాత్రులను కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన