గాంధీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

ప్రధానాంశాలు

Published : 21/10/2021 05:49 IST

గాంధీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు
పరుగులు తీసిన రోగులు, సహాయకులు
సకాలంలో ఆర్పివేయడంతో తప్పిన ముప్పు
100 మందికి పైగా రోగులు మరో బ్లాకుకు తరలింపు

ఈనాడు, హైదరాబాద్‌- గాంధీ ఆసుపత్రి, న్యూస్‌టుడే: గాంధీ ఆసుపత్రిలోని ప్రధాన భవనంలో బుధవారం ఉదయం 7.20 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించడంతో కలకలం రేగింది. సెల్లార్‌లోని ఎలక్ట్రికల్‌ రూంలో ఉన్న ఫ్యూజు బోర్డులో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. నాలుగో అంతస్తు వరకు కేబుళ్లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక శాఖ అవుట్‌ పోస్టు సిబ్బంది హుటాహుటిన వచ్చి ఆసుపత్రి సిబ్బందితో కలిసి మంటలను అదుపులోకి తేవడంతో పెనుముప్పు తప్పింది. నార్త్‌బ్లాక్‌ మొత్తం విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. పరిపాలన విభాగాలతోపాటు ఆర్థో, గైనిక్‌, పీడియాట్రిక్‌ సర్జరీ, ఈఎన్‌టీ, ప్లాస్టిక్‌ సర్జరీ తదితర విభాగాలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడున్న 100 మందికి పైగా రోగులను ఇతర వార్డుల్లో సర్దుబాటు చేశారు. ఎవరికీ ప్రమాదం జరగలేదని, ఇక్కడి రోగులను సౌత్‌బ్లాకుకు తరలించామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు.

మంటలు, పొగ వ్యాపించడంతో నార్త్‌బ్లాకులోని రోగులు, సహాయకులు, వైద్యసిబ్బంది భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. పడకలపై చికిత్స పొందుతున్న వారు, ఆక్సిజన్‌ సాయంతో ఉన్నవారు, గర్భిణులు, బాలింతలు భీతావహులయ్యారు. మూడు రోజుల్లో విద్యుత్తు సరఫరా పునరుద్ధరించే అవకాశముంది. మొత్తం అయిదు లిఫ్టుల్లో ప్రస్తుతం రెండు పనిచేయడంలేదు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే డీఎంఈ రమేష్‌రెడ్డి ఆసుపత్రిని పరిశీలించారు. మాక్‌డ్రిల్‌ శిక్షణ పొందిన 30 మంది సిబ్బంది విధుల్లో ఉండడంతో వెంటనే స్పందించారని, దీంతో ప్రమాదాన్ని సకాలంలో అరికట్టగలిగామని అధికారులు తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన