హత్యకేసులో తొమ్మిది మందికి ఉరిశిక్ష

ప్రధానాంశాలు

Published : 22/10/2021 04:51 IST

హత్యకేసులో తొమ్మిది మందికి ఉరిశిక్ష

ఖరారు చేసిన రాయగడ జిల్లా న్యాయస్థానం

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: చేతబడి అనుమానంతో ఒడిశాలో ఓ కుటుంబాన్ని దారుణంగా హత్య చేసిన కేసులో తొమ్మిది మందికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ రాయగడ జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. గుణుపురం సమితి పుటాసింగ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కేసులో కోర్టు గురువారం ఈ తీర్పునిచ్చింది. స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కృష్ణచంద్ర సేనాపతి వెల్లడించిన ప్రకారం.. పుటాసింగ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి కిత్తుంగ గ్రామానికి చెందిన ఓ కుటుంబాన్ని (ముగ్గురు వ్యక్తులు) 2016 సెప్టెంబరు 9న చేతబడి నెపంతో నిందితులు హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదైంది. గ్రామంలో కొందరు అతిసారం, ఇతర అనారోగ్యాలతో మృతి చెందగా, ఆ కుటుంబం చేతబడి చేయడం వల్లే ఇదంతా జరిగిందని నిందితులు అనుమానం పెంచుకున్నారు. సెప్టెంబరు 9న రాత్రి.. అసిన సబరొ, ఆయన భార్య అంబేయి, పెద్దకుమార్తె ఆస్మని సబరొలను ఇంట్లో ఓ స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం వారితో బలవంతంగా విషం తాగించి వారు బతికుండగా ఇంట్లోనే ఖననం చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని అసిన చిన్న కుమార్తెను నిందితులు బెదిరించారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిందనే విషయం తెలుసుకున్న నిందితులు మరోసారి మృతదేహాలను బయటకు తీసి అక్కడే దహనం చేశారు. దీనిపై 2018 ఏప్రిల్‌లో గుణుపురంలోని జిల్లా అదనపు జడ్జి (ఏడీజే) కోర్టు తొమ్మిది మంది నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు కేసును పునర్విచారణ చేయాల్సి ఉండగా, గుణుపురం ఏడీజే కేసును రాయగడ జిల్లా న్యాయస్థానానికి బదిలీ చేశారు. గురువారం విచారణ సందర్భంగా జిల్లా కోర్టు న్యాయమూర్తి విక్రమ్‌కేసరి పట్నాయక్‌ ఈ మేరకు తీర్పు ఇచ్చినట్లు సేనాపతి వెల్లడించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన